Chinese Astronauts Returns: 90 రోజుల రోదసీ యాత్రను పూర్తి చేసుకున్న ముగ్గురు చైనీస్ వ్యోమగాములు క్షేమంగా భూమికి చేరుకున్నారు. అంతరిక్ష కేంద్రం నిర్మాణం కోసం కక్ష్యలోకి వెళ్లిన మొదటి బృందం శుక్రవారం తిరిగి వచ్చేసింది. వీరు రెండు స్పేస్‌వాక్స్ కూడా చేశారని చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ అధికారులు తెలిపారు. సుదీర్ఘ కాలం సిబ్బందితో కూడిన రోదసీయానం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన చైనీయులుగా రికార్డు సృష్టించారు.
చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ (సీఎంఎస్ఏ) శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం.. షెంఝౌ 12 మ్యాన్డ్ స్పేస్‌షిప్ రిటర్న్ క్యాప్సూల్ ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా అటానమస్ రీజియన్‌లో, డోంగ్‌ఫెంగ్ ల్యాండింగ్ సైట్ వద్ద భూమికి చేరుకుంది. ఇందులో వ్యోమగాములు నీయ్ హైషెంగ్, లియు బోమింగ్, టాంగ్ హోంగ్బో ఉన్నారు.
షెంఝౌ 12 మ్యాన్డ్ స్పేస్‌షిప్ రిటర్న్ క్యాప్సూల్ భూమి వాతావరణంలోకి వచ్చిందని అంతకుముందు చైనా వార్తా సంస్థ జిన్‌హువా తెలిపింది. దాని ప్రధాన ప్యారాచూట్ విజయవంతంగా డిప్లాయ్ అయిందని, అది దిగే వేగం నెమ్మదిగా తగ్గుతోందని తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు స్పేస్‌క్రాఫ్ట్ ప్రొపెల్లెంట్ నుంచి రిటర్న్ మాడ్యూల్ విడిపోయిందని పేర్కొంది. ఈ మొత్తం ప్రక్రియ చాలా సున్నితంగా జరిగిందని గ్లోబల్ టైమ్స్ తెలిపింది. భూమిపైకి తిరిగి వచ్చే సమయంలో వ్యోమగామి టాంగ్ హోంగ్బో పెన్నుతో ఆడుకుంటుండటం కనిపించినట్లు తెలిపింది. నిజమైన బంగారం మంటలకు భయపడదని నీయ్ హైషెంగ్ తన సహచరునితో జోక్ చేశారని తెలిపింది.
ఇదిలావుంటే, షెంఝౌ 12 మానవ సహిత రోదసి నౌకను చైనా జూన్‌లో పంపించింది. చైనీయులు దిగువ భూ కక్ష్యలో సుదీర్ఘకాలం ఉండటం ఇదే తొలిసారి. చైనా పంపించిన మానవులతో కూడిన రోదసి నౌకల్లో ఇది ఏడోదని చైనా మీడియా పేర్కొంది.