Chinese Man: మీరు ఎప్పుడైనా విమానాశ్రయంలో ఫ్లైట్ కోసం ఎదురుచూస్తున్నప్పుడు కానీ.. లేదా ఎయిర్ పోర్ట్( Airport) లో మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు స్వాగతం చెప్పడానికి వెళ్ళినప్పుడు.. చుట్టుపక్కల పరిశరాలను పరిశీలిస్తే.. భిన్నమైన అనుభవాలు ఎదురవుతాయి. అక్కడ రకరకాల వ్యక్తులు కనిపిస్తారు. కొందరు తమ స్నేహితుల కోసం, సన్నిహితుల కోసం వెదుకుతూ ఉంటారు. ఇంకొందరు షాపింగ్ చేస్తుకనిపిస్తారు., మరికొందరు తమ విమానాన్ని ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అసలు ఎయిర్‌పోర్ట్ నే ఇల్లుగా మార్చుకుని కొన్నేళ్లుగా నివశిస్తున్నవ్యక్తి ఉంటారని ఎప్పుడైనా ఊహించారా? అవును ఇది నిజం.. ఓ వ్యక్తి.. తన కుటుంబం బారి నుంచి తప్పించుకోవాలని.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 ఏళ్లుగా విమానాశ్రయంలోనే నివాసం ఉంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే..
చైనా(China)కు చెందిన ఓ వ్యక్తి గత 14 సంవత్సరాలుగా బీజింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Beijing Capital International Airport) లో నివసిస్తున్నాడు. బీజింగ్‌కు చెందిన వీ జియాంగ్వో 2008లో భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుండి అతను మూడు టెర్మినల్‌లను కలిగి ఉన్న బీజింగ్ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ని ఎంచుకున్నాడు. టెర్మినల్ 2 నే ఇల్లుగా మార్చుకుని నివసిస్తున్నాడు.
అయితే వీ జియాంగ్వో కు ఉద్యోగం లేదు. అతను విమానాశ్రయంలో నివసించడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే ఇక్కడైతే ఇష్టానుసారంగా తాగొచ్చు, తినొచ్చు అంటాడు. ఇదే విషయంపై చైనా డైలీతో స్పందిస్తూ.. “నాకు ఇంట్లో స్వేచ్ఛ లేదు. అందుకనే నేను ఇంటికి తిరిగి వెళ్ళలేను. “నేను ఇంట్లో ఉండాలనుకుంటే.. ధూమపానం, మద్యపానం మానేయాలని నా కుటుంబం నాకు చెప్పారు. నేను కనుక సిగరెట్ స్మోకింగ్, మందు మానేయక పొతే.. నాకు నెల నెల ప్రభుత్వం ఇస్తున్న అలవెన్స్ 1,000 యువాన్ (AU$200) కుటుంబానికి ఇవ్వాలి. అయితే నేను నాకు ప్రభుత్వం ఇస్తున్నది ఫ్యామిలీకి ఇచ్చేస్తే.. నేను నా సిగరెట్, మద్యం ఎలా కొనుగోలు చేస్తాను ?” అందుకనే ఇంటి నుంచి వచ్చేశా.. అప్పటి నుంచి విమానాశ్రయంలో జీవిస్తున్నా అని చెప్పాడు.
వీ జియాంగ్వో ఇంటి నుంచి తెచ్చుకున్న ఎలక్ట్రిక్ కుక్కర్‌తో మొబైల్ కిచెన్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభుత్వం ఇస్తున్న డబ్బులతో తనకు నచ్చిన తిండి తింటూ, తాగుతూ జీవిస్తున్నాడు.
అయితే ఇలా విమానాశ్రయంలో ఏళ్ల తరబడి ఉండే వ్యక్తి ఒక్క వీ జియాంగ్వో మాత్రమే కాదు.. ఇరాన్‌కు చెందిన మెహ్రాన్ కరీమి నాస్సేరీ అనే శరణార్థి పారిస్ చార్లెస్ డి గల్లెలోని ఒక టెర్మినల్‌లో 2006 వరకు.. అంటే ఆసుపత్రిలో చేరే వరకు 18 సంవత్సరాలు నివసించాడు. బ్రిటీష్ అధికారులు అతన్ని బ్రిటన్‌కు అనుమతించకపోవడంతో అతను అక్కడ నివసించవలసి వచ్చింది. ఫ్రెంచ్ అధికారులు కూడా అతడి ప్రవేశాన్ని తిరస్కరించారు.