అంతర్జాతీయ మార్కెట్‌లో రారాజుగా మారాలన్న చైనా ప్రయత్నాలు ఒక్కొక్కటిగా బెడిసి కొడుతున్నాయి. స్వీయ అపరాధాలతో పతనం వైపుగా అడుగులు వేస్తోంది. మరోవైపు చైనా కుబేరులు సైతం నష్టాల్ని చవిచూస్తున్నారు. మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు అవుతుండడం చైనాకు మింగుడు పడడం లేదు. ఈ తరుణంలో డ్రాగన్ కంట్రీ చేసిన తాజా ప్రకటన ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తోంది. ప్రస్తుతం డిజిటల్ ట్రేడింగ్‌లో బిట్ కాయిన్ తదితర క్రిప్టో కరెన్సీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో ఈ కరెన్సీని నిషేధించాల్సిన అవసరం ఉందని చైనా అభిప్రాయపడింది. క్రిప్టో అనేది ఫ్లాట్ కరెన్సీ కాదని వాదిస్తున్న చైనా.. వీలైనంత త్వరలో తమ దేశంలో నిషేధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొంది. మరోవైపు క్రిప్టో కరెన్సీ సంబంధిత లావాదేవీలన్నీ చట్టవ్యతిరేకమైనవని చైనా కేంద్రీయ బ్యాంకు స్పష్టం చేసింది.
పడిపోయిన టోకెన్ ధరలు
డిజిటల్ కరెన్సీని నిషేధించాలని డ్రాగన్ కంట్రీ ప్రకటన.. డిజిటల్ ట్రేడ్‌పై ప్రతికూల ప్రభావం చూపెట్టింది. వర్చువల్ కరెన్సీ విలువల్లో విపరీత మార్పులు తెచ్చింది. క్రిప్టోకరెన్సీల విలువ(బిట్ కాయిన్, ఎథెరియమ్)లు ఒక్కసారిగా పడిపోయింది. బిట్‌కాయిన్ విలువ ఐదు శాతం పడిపోయి 42,232 డాలర్లకు చేరింది. ఇక రెండో అతిపెద్ద టోకెన్‌గా పేరున్న ఎథెరియమ్ విలువ 6.3 శాతం డ్రాప్ అయ్యి 2,888కు చేరింది. సోలానా 6.9శాతం తగ్గిపోయి 134 డాలర్లకు చేరింది. ఇక లైట్‌కాయిన్ విలువ 5.9 శాతం తగ్గి 149 డాలర్లకు చేరుకుంది. కార్డానో విలువ 2.4 శాతం పడిపోయి.. 2.15 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
చైనా అభ్యంతరాలు..
క్రిప్టో కరెన్సీ లావాదేవీల మనుగడ దేశీయ మార్కెట్‌కు నష్టమని చైనా అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలోనే క్రిప్టో సంబంధిత లావాదేవీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అనుకుంటోంది. విదేశీ సంస్థలు అందించే క్రిప్టో సేవలు అక్రమమైనవేనని పేర్కొంది. అదే సమయంలో దేశంలో బిట్‌కాయిన్ సహా క్రిప్టో కరెన్సీ మొత్తాన్ని నిషేధించాలని ప్రభుత్వానికి చైనా సెంట్రల్ బ్యాంక్ సలహా ఇచ్చింది.
► డిజిటల్ ట్రేడింగ్‌లో క్రిప్టోకరెన్సీ ఇప్పుడు ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంది.
► ఎలన్ మస్క్ లాంటి బిలియనీర్ల ప్రోత్సాహంతో.. జనాలు సైతం ఈ-కరెన్సీపై నమ్మకం పెంచుకుంటున్నారు.
► ప్రపంచంలో చాలా దేశాలు క్రిప్టోకరెన్సీ లావాదేవీల్ని అనుమతిస్తున్నాయి.
► చైనా అతిపెద్ద క్రిప్టోకరెన్సీకి మార్కెట్ కూడా.
► అయినప్పటికీ చైనా మాత్రం క్రిప్టో కరెన్సీని అంగీకరించడం లేదు
► ఆర్థిక వ్యవస్థకు ఒరిగేదీ ఏమి లేదని, పైగా వర్చువల్ కరెన్సీ వల్ల కార్బన్ ఉద్గారాలు ఉధృతంగా ఉత్పత్తి అవుతాయని సొల్లు కారణాలు చెబుతోంది.
► మే నెలలో చైనా స్టేట్ కౌన్సిల్ ఏకంగా బిట్‌కాయిన్ మైనింగ్‌ను మూసేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
► నిషేధ నిర్ణయం గనుక అమలు అయితే.. భారీగా నష్టపోయేది ముందుగా చైనానే!
ఇంతకీ అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి?..
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ కరెన్సీ… దీన్నే క్రిప్టోమనీ , క్రిప్టోగ్రఫీ కరెన్సీ, ఎన్క్రిప్షన్ కరెన్సీ అని కూడా పిలుస్తారు. అంతర్జాతీయంగా డిమాండ్, సరఫరా ఆధారంగా వీటి విలువ మారుతుంది. ఇది ఏ దేశానికీ చెందదు. ఏ నియంత్రణ సంస్థ పరిధిలోకీ రాదు. ఇది ఒక అంతర్జాతీయ కరెన్సీ.. క్రిప్టోకరెన్సీ సృష్టికర్త కూడా ఎవరికీ తెలియదు. క్రిప్టోకరెన్సీలో ఒక భాగం బిట్‌కాయిన్. అక్టోబర్ 31, 2008 న బిట్‌కాయిన్ ప్రస్థానం మొదలైంది. 2013లో బిట్‌కాయిన్ గురించి మొట్టమొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. బిట్‌కాయిన్ కి వర్చువల్ కరెన్సీ అని కూడా పేరు. బిట్ కాయిన్‌ను అక్టోబర్ 7, 2011న మొదటిసారి పంపిణీ చేశారు. బిట్‌కాయిన్ కోడ్‌బేస్‌లో అనేక మార్పులకు గురైన తర్వాత క్రిప్టో కరెన్సీగా మార్పు చెందింది. ఆ తర్వాత 2014 లో మోనెరో, ఎథెరియం, ఎన్ఎక్స్టి వంటి క్రిప్టోకరెన్సీలు బయటకి వచ్చాయి. ఇప్పటి వరకు 3,000లకు పైగా క్రిప్టోకరెన్సీలు చలామణిలో ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ ద్వారా నష్టాలు ఉన్నాయా ?
సాధారణ ప్రజలపై తక్కువ ప్రభావం మాత్రమే చూపుతుంది క్రిప్టోకరెన్సీ. వీటి చెల్లింపుల నెట్‌వర్క్ సరిగా లేదంటూ ఇప్పటికే చాలాసార్లు విమర్శలు వచ్చాయి. క్రిప్టో కరెన్సీలు ఒకదానికొకటి అనుకూలంగా లేవనే విమర్శలున్నాయి. వీటిలో అధిక అస్థిరత ఉందని ఒక దగ్గర స్థిరంగా ఉండవని వినియోగదారుల నుంచి ఫిర్యాదులున్నాయి. క్రిప్టో కరెన్సీ పేరుతో పలు దేశాలలో అక్రమాలు జరుగుతున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. క్రిప్టోకరెన్సీలు కేంద్ర బ్యాంకులపై ఆధారపడకపోవడం పెద్ద మైనస్. క్రిప్టోకరెన్సీని బ్యాంకులు వ్యతిరేకిస్తున్నాయి.
క్రిప్టో కరెన్సీ ద్వారా లాభాలు ఏంటి?
క్రిప్టోకరెన్సీ ద్వారా నకిలీ లేదా మోసగించడం సాధ్యం కాదు. ఇంటర్నెట్ వ్యాపారులకు చట్టబద్దమైన టెండర్ కరెన్సీల ఆధారంగా చెల్లింపు వ్యవస్థలకు ప్రత్యామ్నాయాలను అందించనుంది క్రిప్టోకరెన్సీ. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆన్‌లైన్ వాణిజ్యం పెంచడానికి ఇది దోహదం చేస్తోంది. బదిలీ ఫీజులు, చెల్లింపు సంస్థలు లేదా ఫండ్ ట్రాన్స్ఫర్ విషయంలో కంపెనీల కన్నా తక్కువ ఫీజుతో దీని ద్వారా చెల్లింపులు జరిపే వీలుంది. బ్యాంక్ బదిలీలతో పోలిస్తే సెకన్ల నుంచి నిమిషాల్లోగా నగదు బదిలీలు కావటం దీని ప్రత్యేకత. దేశంతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా సులభంగా నగదు బదిలీలు జరిగిపోతుంది. మధ్యవర్తి లేకపోవటం ..జమ చేసిన మొత్తాన్ని నేరుగా స్వీకరించే చిరునామాకు తీసుకువెళ్లడంతో క్రిప్టో కరెన్సీ వైపు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. ఏదైనా వ్యక్తి లేదా సంస్థ క్రిప్టోకరెన్సీని సులభంగా బదిలీ చేసే అవకాశం ఉంది. దీంతో కొంతమంది క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు జరుపుతున్నారు.
Also Read..
దోమ కాటేస్తే అంతే సంగతులు.. డెంగ్యూ కొత్త మ్యూటెంట్..11 రాష్ట్రాల్లో కల్లోలం.. వీడియో