టూర్ పేరుతో ట్రాప్.. థాయిలాండ్‌లో భారతీయులను కిడ్నాప్..!

థాయ్‌లాండ్‌లో ముగ్గురు భారతీయులను అపహరించి వారి కుటుంబాల నుంచి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేసిన కేసులో ఐదుగురు భారతీయులను థాయ్ పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకాక్‌లోని ఖ్లోంగ్ టాన్ ప్రాంతంలోని ఓ హోటల్‌లో దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది.

టూర్ పేరుతో ట్రాప్.. థాయిలాండ్‌లో భారతీయులను కిడ్నాప్..!
Indians Kidnapped In Thailand

Updated on: Jul 30, 2026 | 9:16 AM

థాయ్‌లాండ్‌లో ముగ్గురు భారతీయులను అపహరించి వారి కుటుంబాల నుంచి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేసిన కేసులో ఐదుగురు భారతీయులను థాయ్ పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకాక్‌లోని ఖ్లోంగ్ టాన్ ప్రాంతంలోని ఓ హోటల్‌లో దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది.

పోలీసులు అరెస్టు చేసిన వారిని అవతార్ సింగ్, జగ్జిత్ సింగ్, రాంబలక్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్, కుల్రా సింగ్‌లుగా గుర్తించారు. ప్రాథమిక విచారణలో వీరు తక్కువ ధరలో థాయ్‌లాండ్ విహారయాత్ర ప్యాకేజీ ఇప్పిస్తామని నమ్మించి ముగ్గురు భారతీయులను అక్కడికి రప్పించినట్లు వెల్లడైంది. అనంతరం వారిని పట్టాయాలోని ఓ ఇంటికి తీసుకెళ్లి బందీలుగా ఉంచారు. వారి కుటుంబాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.40 లక్షలు డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు నెల రోజుల క్రితం ఒక చాట్ అప్లికేషన్ ద్వారా పరిచయమైన పాకిస్తానీ జాతీయుడు ఈ అపహరణకు సూత్రధారిగా వ్యవహరించినట్లు నిందితులు వెల్లడించినట్లు సమాచారం. దుబాయ్‌లో ఉంటూ ఈ మొత్తం కుట్రను అతడే నడిపించినట్లు థాయ్ పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుల నుంచి క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బు వసూలు చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు.

బాధితుల కుటుంబ సభ్యులు భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించడంతో కేసు వెలుగులోకి వచ్చింది. చేతులు, కాళ్లు కట్టేసి చిత్రహింసలకు గురిచేస్తున్న వీడియో కాల్స్ కుటుంబాలకు పంపడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. వెంటనే భారత రాయబార కార్యాలయం థాయ్ అధికారులను అప్రమత్తం చేయడంతో పోలీసులు పట్టాయాలోని ఓ రెండంతస్తుల ఇంటిపై దాడి చేసి ముగ్గురు బాధితులను సురక్షితంగా రక్షించారు. ఆ సమయంలో వారి చేతులు, కాళ్లు కట్టివేసి ఉండటంతో పాటు శారీరక దాడికి గురైన ఆనవాళ్లు గుర్తించారు.

సోదాల్లో అంటుకునే టేప్, చెక్క కర్ర, ఎర్ర రంగు స్ప్రే పెయింట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితులకు తీవ్రమైన గాయాలైనట్లు చూపిస్తూ కుటుంబాలపై ఒత్తిడి తెచ్చేందుకు స్ప్రే పెయింట్‌ను ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు. ఇదే ఇంట్లో గతంలో మరో భారతీయుడిని కూడా బంధించి, అతని కుటుంబం రూ.30 లక్షలు చెల్లించిన తర్వాతే విడుదల చేసినట్లు బాధితులు వెల్లడించారు. ఈ కేసులో అంతర్జాతీయ ముఠా ప్రమేయంపై థాయ్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us