16ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా చూడటం నిషేధం.. అక్కడి ప్రభుత్వ సంచలన నిర్ణయం

పిల్లలకు సోషల్ మీడియా గేట్లు మూసేసిందా దేశం. ఇంతకూ ఒక్కసారిగా ఇంత పెద్ద నిర్ణయం ఆకంట్రీ ఎందుకు తీసుకుంది ? సోషల్ మీడియా అంత ప్రమాదకరంగా మారిందా ? పిల్లల పేరెంట్స్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారా..? సేమ్ బ్యాన్ మనదేశంలో విధించే చాన్సుందా ? బ్యాన్ వెనుక అసలు నిజం ఏంటి..? 

16ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా చూడటం నిషేధం.. అక్కడి ప్రభుత్వ సంచలన నిర్ణయం
Social Media Ban

Edited By: Ram Naramaneni

Updated on: Dec 10, 2025 | 8:23 PM

16ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై ఆస్ట్రేలియా పూర్తిగా నిషేధించింది. పిల్లల భద్రత, మానసిక ఆరోగ్యం, ఇంటర్నెట్ ప్రపంచంలో పెరుగుతున్న ప్రమాదాల నుంచి కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం చెబుతోంది. స్క్రీన్ ముందు ఎక్కువసేపు గడుపుతూ పిల్లల్లో ఒత్తిడి, ఒంటరితనం పెరుగుతోందని, అలాగే చదువు దెబ్బతింటోందని అక్కడి నివేదికలు చెబుతున్నాయి. అలాగే తల్లిదండ్రుల్లోనూ సోషల్ మీడియాపై ఆందోళన పెరగడంతో పిల్లల రక్షణే మొదటి ప్రాధాన్యంగా తీసుకుని బ్యాన్ విధించింది. ఈ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.

అయితే చట్టాన్ని అమలు చేయాలంటే కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.. ఏజ్ వెరిఫికేషన్ అన్నది మొదటి సవాల్. పిల్లలు తప్పుడు వివరాలతో అకౌంట్స్ తెరవడం కొత్త విషయం కాదు. VPNలతో లాగిన్ కావడం కూడా సులువే. సోషల్ మీడియా కంపెనీలు నియమాలను పాటించకపోతే భారీ జరిమానాలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ బ్యాన్ అమలు కష్టసాధ్యమంటున్నాయి సోషల్ మీడియా ఫాట్‌ఫామ్స్ . నిబంధనలు పెట్టడం సులువు కానీ పిల్లలు వాటిని దాటేందుకు ప్రయత్నించడం కూడా అంతే సులువు అంటున్నాయి సామాజిక మాధ్యమాలు. ఈ బ్యాన్ తో పిల్లల ప్రైవసీ, కంట్రోల్ లేని మార్గాల్లో సోషల్ మీడియా వైపు వెళ్లే ప్రమాదం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమలు చేయాలంటే టెక్నికల్ టూల్స్, ప్రభుత్వ పర్యవేక్షణ, కంపెనీల సహకారం అన్నీ సమన్వయంతో పనిచేయాల్సి ఉంది. కానీ ఇది ఒకరోజుతో అయ్యే పని కాదంటున్నాయి కంపెనీలు. అందుకే ఆస్ట్రేలియా సోషల్ మీడియా బ్యాన్ పట్ల మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

మరోవైపు బ్యాన్ మంచిదే అన్న వాదనలూ వస్తున్నాయి. పిల్లలను అనారోగ్య కంటెంట్ నుంచి దూరంగా ఉంచటం, అన్‌వాంటెడ్ మెసేజ్‌లు, ట్రోలింగ్ వంటి వాటితో వచ్చే మానసిక ఒత్తిడిని తగ్గించవచ్చన్న వాదనా వినిపిస్తోంది. మెజార్టీ పేరెంట్స్ సోషల్ మీడియా బ్యాన్‌ను సమర్ధిస్తున్నారు. పిల్లలు రియల్ లైఫ్‌లోకి వచ్చి, చదువుపై దృష్టిపెట్టే అవకాశం ఉందని, అన్నిటి కంటే ముఖ్యం ఇంటర్నెట్ వ్యసనంతో కుటుంబ బంధాలకు పిల్లలు దూరమయ్యారని, బ్యాన్ వల్ల పిల్లలు పేరంట్స్‌తో ఎక్కువసేపు గడిపే సమయం దొరుకుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే సోషల్ మీడియా సంస్థలు మాత్రం బ్యాన్ నిర్ణయాన్ని వ్యక్తిగత స్వేచ్ఛకు భిన్నంగా చూస్తున్నాయి.

మరోవైపు మనదేశంలో కూడా ఇలాంటి చట్టం తెచ్చే యోచన ఉన్నట్లు ఆమధ్య ప్రచారం జరిగింది. ముఖ్యంగా భారత్‌లో ఇంటర్నెట్ వినియోగం మరింత ఎక్కువ. కానీ ఈ తరహా నిషేధం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాకపోవచ్చు. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ బలంగా ఉండకపోవడం, డిజిటల్ విద్య ఇంకా పూర్తిగా అందుబాటులో లేకపోవడం వల్ల ఆస్ట్రేలియా తరహా నిషేధం ప్రస్తుతం అమలయ్యే అవకాశం లేదంటున్నారు నిపుణులు. ప్రస్తుతం సోషల్ మీడియా సమాచార వనరుగా మారింది. చదువులోనూ, పలు ప్రాజెక్టుల్లోనూ ఉపయోగపడుతోంది. కాబట్టి భారత్‌లో ఇది సాధ్యం కాదంటున్నారు నిపుణులు. పిల్లల భద్రతపై కట్టుదిట్టమైన నిబంధనలు, వయసు ఆధారిత నియంత్రణ, కంటెంట్ పరిశీలన, తల్లిదండ్రుల అవగాహన ఇవన్నీ అవసరం. భద్రత, స్వేచ్ఛ, ప్రయోజనం, ఈ మూడు అంశాలను బట్టి మన దేశంలో భవిష్యత్‌లో విధానాలు మారవచ్చు. ఈ బ్యాన్ డిజిటల్ ప్రపంచంలో పిల్లల భద్రత కోసం “స్టార్ట్ పాయింట్”గా భావించాలి. కాని ఇది పూర్తి పరిష్కారమైతే కాదంటున్నారు నిపుణులు.