Afghan Woman: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైన నాటినుంచి ఆ దేశంలో భయంకరమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఆప్ఘనిస్తాన్ ప్రజలు కంటి మీద కునుకులేకుండా వణికిపోతున్నారు. ఆఫ్గన్‌ను కైవసం చేసుకున్న అనంతరం కఠినమైన షరియా చట్టాలను అమలు చేస్తున్నట్లు తాలిబన్లు వెల్లడించారు. బాలికలకు విద్య అవసరం లేదంటూ ప్రకటించారు. బాలికలు, మహిళలు నాలుగు గోడల మధ్య ఉండాల్సిందేనని హుకూం జారీ చేశారు. ఈ క్రమంలోనే తాలిబన్లు మరో నిర్ణయం తీసుకున్నారు. కఠినమైన ఇస్లాం సిద్ధాంతాలతో అమ్మాయిల విద్యకు అనుమతిచ్చారు. దీంతోపాటు కొన్ని ప్రాంతాల్లో మహిళలు పనిచేసేలా సడలింపులు చేశారు. ఈ క్రమంలో ఓ మహిళ కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంది. ధైర్యం చేసి కాబుల్ విమానాశ్రయంలో పని చేయడానికి నిశ్చయించుకుంది. మహిళలు తమ భద్రత కోసం ఇంట్లోనే ఉండాలని ఇస్లామిస్టులు పేర్కొంటున్నప్పటికీ.. ఆ మహిళ పనిచేయాలని నిర్ణయించుకుంది.
ముగ్గురు బిడ్డలకు తల్లి అయినా రబియా జమాల్ (35) ధైర్యం చేసి కాబుల్ విమానాశ్రయంలో తిరిగి ఉద్యోగంలో చేరింది. కాబుల్ విమానాశ్రయంలో మహిళా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు అంతర్జాతీయ వార్త సంస్థలు వెల్లడించాయి. రబియా జమాల్ 2010 నుంచి విమానాశ్రయంలో పనిచేస్తున్నట్లు పేర్కొంది. తన కుటుంబాన్ని పోషించుకోవటానికి డబ్బు కావాలని.. ఇంట్లో ఉంటే ఎలా అంటూ ఆమె తెలిపింది. తాలిబన్లు ఆఫ్గన్‌ను కైవసం చేసుకున్న అనంతరం.. చాలా బాధగా అనిపించిందని.. ఉద్యోగంలో చేరాక కొంచెం ప్రశాంతంగా ఉందంటూ రబియా తెలిపింది.
అయితే.. కాబుల్ విమానాశ్రయంలో 80కి పైగా మంది మహిళలు పనిచేసేవారు. అందులో 12 మంది మాత్రమే తిరిగి ఉద్యోగంలో చేరడానికి వచ్చారని మీడియా వెల్లడించింది. మహిళలు ఉద్యోగంలో చేరడానికి తాలిబన్లు అనుమతిచ్చిన అతి కొద్ది మంది వారిలో వీళ్లు ఉన్నట్లు పేర్కొంటున్నారు. అయితే.. తదుపరి నోటీసులు ఇచ్చే వరకు ఉద్యోగంలో చేరొద్దని చాలా మంది మహిళలకు తాలిబన్లు స్పష్టంచేశారు. అయితే.. విమానంలో ప్రయాణించే మహిళా ప్రయాణికులను స్కాన్ చేసి పంపించేందుకు.. ఆరుగురు మహిళా సిబ్బంది ఎయిర్‌పోర్టు ప్రధాన ద్వారం వద్ద నిలబడి నవ్వుతూ కనిపించినట్లు ఓ వార్త సంస్థ వెల్లడించింది.
అయితే.. తాలిబన్లు కాబుల్‌ను స్వాధీనం చేసుకోవడంతో షాక్‌కు గురైనట్లు మరో మహిళ ఉద్యోగి పేర్కొంది. తర్వాత ఏం జరుగుతుందోనని చాలా భయం వేసిందని.. ఉద్యోగంలో చేరుతున్నానంటే తన వద్దన్నారని.. కానీ వారి మాట వినకుండా వచ్చానని 49 ఏళ్ల కుద్సియా జమాల్ పేర్కొంది.
Also Read: