Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ..

ఉత్తర జపాన్‌లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో సునామీ హెచ్చరిక జారీ చేశారు. ఉత్తర ఇవాటే ప్రిఫెక్చర్ సమీపంలోని పసిఫిక్ జలాల్లో సాయంత్రం 4:53 గంటలకు (0753 GMT) భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల తీవ్రత వల్ల వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న టోక్యో వరకు పెద్ద భవనాలు కంపించాయి.

Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ..
Japan Earthquake

Updated on: Apr 20, 2026 | 2:28 PM

ఉత్తర జపాన్‌లో సోమవారం 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో జపాన్ ప్రభుత్వం సునామీ అలర్ట్ జారీ చేసింది. మూడు మీటర్ల (10 అడుగుల) ఎత్తు వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ (JMA) సునామీ హెచ్చరిక జారీ చేసింది.

ఉత్తర ఇవాటే ప్రిఫెక్చర్ సమీపంలోని పసిఫిక్ జలాల్లో సాయంత్రం 4:53 గంటలకు (0753 GMT) భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల తీవ్రత వల్ల వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న టోక్యో వరకు పెద్ద భవనాలు కూడా కంపించాయి.

తొలి సునామీ అలలు వెంటనే ఉత్తర తీరాన్ని చేరుకోవచ్చని వాతావరణ సంస్థ తెలిపింది.

“తీరప్రాంతాలు, నదీ తీర ప్రాంతాల నుండి వెంటనే ఎత్తైన ప్రదేశాలు లేదా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లండి” అని సునామీ అలల వల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరిస్తూ అలర్ట్ జారీచేసింది.

“సునామీ అలలు పదేపదే తాకే అవకాశం ఉంది. హెచ్చరికను ఉపసంహరించుకునే వరకు సురక్షిత ప్రాంతాలను విడిచి వెళ్లవద్దు,” అని అందులో పేర్కొన్నారు.

సంక్షోభ నిర్వహణ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.


జపాన్ ప్రపంచంలోనే అత్యంత భూకంపాలు సంభవించే దేశాలలో ఒకటి.. ఇది పసిఫిక్ “రింగ్ ఆఫ్ ఫైర్” పశ్చిమ అంచు వెంబడి ఉన్న నాలుగు ప్రధాన టెక్టోనిక్ ప్లేట్లపై ఉంది. సుమారు 125 మిలియన్ల ప్రజలకు నిలయమైన ఈ ద్వీపసమూహంలో.. సాధారణంగా ప్రతి సంవత్సరం దాదాపు 1,500 భూకంపాలు సంభవిస్తాయి. ప్రపంచంలోని భూకంపాలలో సుమారు 18 శాతం ఇక్కడే సంభవిస్తాయి. వాటిలో అత్యధికం తేలికపాటివే.. అయినప్పటికీ అవి కలిగించే నష్టం అవి సంభవించే ప్రదేశాన్ని బట్టి.. భూమి ఉపరితలం క్రింద అవి తాకే లోతును బట్టి మారుతూ ఉంటుంది.

2011లో, 9.0 తీవ్రత గల భూకంపం సునామీని ప్రేరేపించింది. దానివల్ల 18,500 మంది మరణించారు.. గల్లంతయ్యారు.. ఫుకుషిమా అణు కర్మాగారంలో వినాశకరమైన మెల్ట్‌డౌన్ సంభవించింది.

Follow Us