
పసిఫిక్ మహాసముద్రంలో సునామీ బీభత్సం సృష్టించింది. రష్యాలో భారీ భూకంపంతో సునామీ విరుచుకుపడింది. 4 మీటర్ల వరకు రాకాసి అలలు ఎగసిపడ్డాయి. 30 దేశాలపై రష్యా సునామీ ఎఫెక్ట్ పడింది. అమెరికా తీరాలను సనామీ చుట్టేసింది. అలాస్కా, హవాయి, వాషింగ్టన్, ఓరెగాన్, నార్త్ కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో, సౌత్‌కాలిఫోర్నియా తీరాలను సునామీ అలలు తాకాయి. జపాన్ తీరంలో 3 మీటర్ల వరకు అలలు ఎగసిపడ్డాయి. అత్యవసర సేవలకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది జపాన్. హవాయిలోని హోనోలులులో సునామీ సైరన్లు మోగించారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సునామీ హెచ్చరికలతో భారత్ కాన్సులేట్ అలర్ట్ అయింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచనలు జారీ చేసింది. హెల్ప్‌లైన్ నెంబర్ 1-415-483-6629 ఏర్పాటు చేసింది.
రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో బుధవారం 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో రష్యా, జపాన్ తీర ప్రాంతాలను సునామీ ముంచెత్తింది. పలుచోట్ల రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. అయితే, వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, దీవులకు సునామీ ముప్పు పొంచి ఉంది. ఆ జాబితాను అమెరికా సునామీ వార్నింగ్ సిస్టమ్ విడుదల చేసింది.
ఈక్వెడార్, రష్యా, వాయువ్య హవాయి ప్రాంతాల్లో 3 మీటర్ల కంటే ఎత్తయిన అలలు ఎగసిపడే అవకాశం ఉంది. 1 నుంచి 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే ముప్పు ఉన్న ప్రాంతాల్లో చిలీ, కోస్టారికా, ఫ్రెంచ్ పాలినేషియా, గువామ్, హవాయి, జపాన్, జార్విస్ ఐలాండ్, జాన్‌స్టన్ అటోల్, కిరిబాటి, మిడ్‌వే ఐలాండ్, పాల్మిరా ఐలాండ్, పెరూ, సమోవా, సోలోమన్ దీవులు ఉన్నాయి.
అంటార్కిటికా, ఆస్ట్రేలియా, చుక్, కొలంబియా, కుక్ దీవులు, ఎల్ సాల్వడార్, ఫిజీ, గ్వాటెమాలా, ఇండోనేషియా, మెక్సికో, న్యూజిలాండ్, నికరాగ్వా, పనామా, పపువా న్యూగినీ, ఫిలిప్పీన్స్, తైవాన్ తదితర దేశాల్లో 0.3 నుంచి 1 మీటరు ఎత్తు వరకు అలలు వచ్చే అవకాశం ఉంది. ఇక 0.3 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో అలలు వచ్చే ముప్పు ఉన్న జాబితాలో బ్రూనై, చైనా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, మలేసియా, వియత్నాం దేశాలు ఉన్నాయి.
ఇప్పటికే అమెరికాలోని పశ్చిమ తీర రాష్ట్రాలతో పాటు న్యూజిలాండ్‌లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు.