అమెరికాలో టీచర్ల కన్నీటి గాథ.. చిన్నారుల్లో మానసిక వేదన
అమెరికాలో వేలాది మంది వలస ప్రీ-స్కూల్ టీచర్లు తమ వర్క్ పర్మిట్ తిరస్కరణతో ఉద్యోగాలు కోల్పోయారు. ట్రంప్ ప్రభుత్వం కఠినమైన వలస విధానాల వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. టీచర్లు, పిల్లలు భావోద్వేగంగా వీడ్కోలు పలికారు. ఈ పరిణామం చిన్నారుల మానసిక ఆరోగ్యం, విద్యాభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాఠశాలలు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
వారం క్రితం వరకు అమెరికాలో ప్రీ స్కూల్ టీచర్ల డైలీ రొటీన్ చిన్నారుల ఆటపాటలతోనే గడిచేది. కానీ అక్టోబర్‌లో వారి జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. వారి వర్క్ పర్మిట్ రెన్యువల్ దరఖాస్తును అమెరికా అధికారులు తిరస్కరించారు. దీంతో ప్రీ-స్కూల్ టీచర్లుగా తమ ఉద్యోగాన్ని తక్షణమే వదులుకోవాల్సి వచ్చింది. అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది వలస టీచర్ల పరిస్థితి ఇది. తమ విద్యార్థులకు వీడ్కోలు చెప్పిన క్షణాలను కన్నీటితో గుర్తుచేసుకున్నారు టీచర్లు. తాము సర్వస్వం కోల్పోయామనీ అన్నారు. తాము వెళ్ళిపోతున్నామని చెప్పినప్పుడు, ఎందుకని అడిగిన పిల్లలకు సమాధానం చెప్పలేకపోయామనీ వాపోయారు. పిల్లలు తమను కౌగిలించుకున్నప్పుడు తమ గుండెలు బరువెక్కినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో మొత్తం టీచర్లలో దాదాపు 10 శాతం మంది వలసదారులే ఉన్నారు. దేశవ్యాప్తంగా టీచర్ల కొరత కారణంగా, బైడెన్ ప్రభుత్వం విదేశాల నుంచి నిపుణులను ఆహ్వానించింది. 6,716 మంది టీచర్లను తాత్కాలిక వీసాలపై అమెరికాకు రప్పించారు. అయితే ట్రంప్ ప్రభుత్వం వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తుండటంతో, ఇప్పటికే చట్టబద్ధంగా పనిచేస్తున్న వారి ఉద్యోగం ప్రమాదంలో పడింది. వాషింగ్టన్‌లోని ‘కమ్యూనికిడ్స్’ లాంగ్వేజ్ స్కూల్ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఈ స్కూల్‌లోని 90 శాతం సిబ్బంది వలస నేపథ్యం ఉన్నవారే. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల తమ సిబ్బంది తీవ్రంగా నష్టపోయారని యాజమాన్యం తెలిపింది. ఈ పరిణామాలు కేవలం టీచర్ల జీవితాలనే కాకుండా, చిన్నారుల మానసిక ఆరోగ్యంపై, చదువుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్యార్థులకు వారి టీచర్లతో బలమైన అనుబంధం ఉంటుంది. ఉన్నట్టుండి టీచర్లు దూరమవడం వారిని మానసికంగా కుంగదీస్తోందనీ అంటున్నారు. విద్యా సంవత్సరం మధ్యలోనే టీచర్లు మారిపోతే పిల్లల భాషా నైపుణ్యాల అభివృద్ధి దెబ్బతింటుందని ఒక అధ్యయనం తేల్చింది. దీంతో స్కూళ్ళల్లో ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెరవేరిన ఎమ్మెల్యే శపథం.. నాలుగేళ్ల తర్వాత ఏం చేశాడంటే
అబ్బా.. ఏం వాడకమయ్యా.. రైతన్న తెలివికి సలాం కొట్టాల్సిందే!
గర్భిణీ శవాన్ని ఊర్లోకి రాకుండా అడ్డుకున్న గ్రామ పెద్దలు.. ఎందుకంటే
అరుదైన దృశ్యం.. సౌదీ ఎడారిలో మంచు.. ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన వీడియో