ప్రపంచవ్యాప్తంగా ఏరియా 51 అత్యంత రహస్య ప్రాంతం. ఇక్కడ అమెరికా సైన్యం శిక్షణ పొందుతుంది. శాస్త్రవేత్తలు ఆయుధాలు సహా పలు రకాల టెక్నాలజీలను పరీక్షిస్తారు. ఈ స్థావరాన్ని 1955లో ఏర్పాటు చేశారు. నెవాడ ఎడారిలో 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది ఉంది. ఇక్కడ గతంలో లాక్‌హీడ్ మార్టిన్ యూ-2 నిఘా విమానాలను పరీక్షించారు. ఆ తర్వాత నుంచి అనేక రహస్య ఫైటర్ జెట్ల పనితీరును కూడా ఇక్కడ పరిశీలించారు. ఒకప్పుడు ఇక్కడ ఉపగ్రహ చిత్రాలు తీయడంపై నిషేధం ఉండేది. కానీ, ఇప్పుడు దాన్ని తొలగించారు. ఈ స్థావరం చుట్టూ మోషన్ సెన్సర్లు అమర్చారు. గస్తీ బృందాలు ఎప్పుడూ పహారా కాస్తుంటాయి. సందర్శకులను హెచ్చరిస్తూ పలు చోట్ల బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. నో ఫ్లై జోన్లు, కొన్ని మార్గాల్లో ప్రయాణించడంపై నిషేధాలు ఉంటాయి. గ్రహాంతరవాసులు, గుర్తుతెలియని ఎగిరే వస్తువులు వంటి వాటితో ఏరియా 51కు బలమైన సంబంధాలున్నాయన్న ప్రచారం ఉంది.