భారీ భూకంపం.. 69 మంది మృతి
ఆగ్నేయాసియా దేశం ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం కుదిపేసింది. మంగళవారం రాత్రి మధ్య సెబు ద్వీపం కేంద్రంగా భూకంపం వచ్చింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 6.9 తీవ్రతగా నమోదైంది. భూకంపం ధాటికి 69 మంది మరణించినట్లు అక్కడి మీడియా కథనాలు తెలిపాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. 150 మందికి గాయాలైనట్లు సమాచారం.
యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. మంగళవారం రాత్రి 9గం.59ని. సమయంలో భూమి కంపించింది. బోగో నగర ఈశాన్య దిశగా 17 కిలోమీటర్ల దూరంలో.. 5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ లోతు భూకంపాన్ని.. శాలో భూకంపం గా పరిగణిస్తారు. ఈ తరహా భూకంపాలు ఎక్కువ నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. తాజా ప్రకంపనల ధాటికి ఇళ్లు, ఆఫీసులు కూలిపోగా.. రోడ్లు, బ్రిడ్జిలు దెబ్బ తిన్నాయి. భయంతో జనం రోడ్ల మీదకు పరుగులు తీసారు. రాత్రంతా రోడ్ల మీదే భయంతో జాగారం చేస్తూ ఉండిపోయారు. ప్రకంపనల ధాటికి ఇళ్ల గోడలు బీటలు వారాయి, రోడ్లు చీలిపోయాయని, రాత్రంతా చీకట్లలోనే గడిపామని స్థానికులు వాళ్లు అంటున్నారు. దాన్బంటాయన్ సమీపంలో ఉన్న చారిత్రక రోమన్ కాథలిక్ చర్చ్ తీవ్రంగా దెబ్బతిందని అధికారులు ధృవీకరించారు. తీర ప్రాంతం అల్లకల్లోలంగా ఉండడంతో తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు.. ముప్పు లేకపోవడంతో దానిని ఉపసంహరించుకున్నారు. ప్రకంపనల ధాటికి బోగో చుట్టు పక్కల చాలా గ్రామాలు, పట్టణాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి కొండ చరియలు ఓ ఊరిపై విరిగిపడ్డాయని తెలుస్తోంది. ఆ ప్రాంతంలో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టాల స్పష్టతపై మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. ఒక్క బోగోలోనే 14 మంది మరణించినట్లు సెబూ గవర్నర్ పమేలా బారిక్యువాట్రో ప్రకటించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికా షట్‌డౌన్.. అప్పుడూ ట్రంప్ హయాంలోనే
సింహాద్రి అప్పన్న ఆయుధాలు చూశారా ?? విశేషంగా ఆయుధ పూజ
