‘అణు చెత్త’ను తొలిసారిగా సమాధి చేస్తున్న ఫిన్లాండ్
అణు వ్యర్థాల శాశ్వత నిర్వహణకు ఫిన్లాండ్ నిర్మించిన ‘అంకాలో’ భూగర్భ నిల్వ కేంద్రం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. భూమికి 433 మీటర్ల లోతులో కాపర్ క్యానిస్టర్లు, బెంటోనైట్ మట్టి, సహజ రాతి పొరల రక్షణతో రేడియోధార్మిక వ్యర్థాలను లక్ష సంవత్సరాల పాటు భద్రపరచేలా దీనిని రూపొందించారు. అణుశక్తి రంగంలో ఇది చారిత్రాత్మక ముందడుగుగా భావిస్తున్నారు.
విద్యుత్ అవసరాలను అణుశక్తి తీరుస్తోంది. బొగ్గు, చమురు పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు చాలా దేశాలు అణు విద్యుత్ కేంద్రాలు నిర్మించాయి. అయితే ఎన్నాళ్లుగానో వెంటాడుతున్న ఒక పెద్ద సమస్య ఉంది. అదే రేడియోధార్మిక అణు వ్యర్థాల నిర్వహణ. ప్రమాదకరంగా మారే ఈ వ్యర్థాలను ఎక్కడ, ఎలా పారేయాలి అన్న ప్రశ్నకు ఇప్పటివరకు సమాధానం దొరకలేదు. ఇప్పుడు ఫిన్లాండ్ మొదటిసారిగా అణు వ్యర్థాలను శాశ్వతంగా భద్రపరిచేందుకు ప్రత్యేక భూగర్భ కేంద్రాన్ని నిర్మించింది. దీనిని “అణు చెత్తబుట్ట”గా పిలుస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కు అంకాలో అని పేరు పెట్టారు. అణు విద్యుత్ కేంద్రాల నుంచి వచ్చే అత్యంత ప్రమాదకర రేడియోధార్మిక వ్యర్థాలను భూమికి వందల మీటర్ల లోతులో నిల్వ చేస్తారు. బలమైన గ్రానైట్ రాతి పొరల మధ్య ప్రత్యేక రక్షణ కంటైనర్లలో ఈ వ్యర్థాలను భద్రపరుస్తారు. భవిష్యత్తులో భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా బయటకు రాకుండా భద్రతా ప్రమాణాలతో దీనిని రూపొందించారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ అణు డస్ట్ బిన్ లక్ష సంవత్సరాలు అణు వ్యర్థాలను సురక్షితంగా ఉంచగలదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చివరి దశలో ఉంది. అవసరమైన అనుమతులు లభించిన వెంటనే కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఒకసారి ఇది విజయవంతమైతే ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా ఇదే నమూనాను అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అణు వ్యర్థాల సమస్యకు ఇది నిజంగానే గేమ్ ఛేంజర్‌గా మారుతుందా? లేదా అనే విషయాన్ని ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అణుశక్తి వినియోగం పెరుగుతున్న ఈ కాలంలో, విద్యుత్ ఉత్పత్తితో పాటు వ్యర్థాల నిర్వహణ కూడా ఎంత ముఖ్యమో ఫిన్లాండ్ ప్రపంచానికి చూపిస్తోంది. అణు విద్యుత్ కేంద్రాలు భారీ స్థాయిలో విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలవు. కానీ వాటి నుంచి వెలువడే రేడియోధార్మిక వ్యర్థాలు మాత్రం ప్రపంచానికి పెద్ద సవాలుగా మారాయి. ఈ వ్యర్థాలు సాధారణ చెత్తలా కాదు. కొన్ని వేల సంవత్సరాల పాటు రేడియోధార్మికతను విడుదల చేస్తూ ప్రమాదకరంగా ఉంటాయి. అందుకే వాటిని సురక్షితంగా నిల్వ చేయడం అణుశక్తి రంగంలో అత్యంత క్లిష్టమైన సమస్యగా భావిస్తారు. 1950ల నుంచే ప్రపంచవ్యాప్తంగా అణు విద్యుత్ కేంద్రాల కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ, వాటి వ్యర్థాల శాశ్వత నిర్వహణకు సరైన పరిష్కారం ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం చాలా దేశాలు ఈ వ్యర్థాలను ప్రత్యేక నీటి కొలనుల్లో ఉంచి శీతలీకరిస్తున్నాయి. ఇది కేవలం తాత్కాలిక పరిష్కారమే తప్ప శాశ్వత మార్గం కాదు. ఫిన్లాండ్‌లోని యూరజోకీ ప్రాంతంలో అడవి మధ్య నిర్మించిన ఈ భూగర్భ కేంద్రం నిర్మాణం సాధారణమైనది కాదు. దీని కోసం 190 కోట్ల ఏళ్ల నాటి భారీ గ్రానైట్ శిలలను పేల్చి లోతైన సొరంగాలు తవ్వారు. ప్రకృతి సిద్ధంగా అత్యంత స్థిరంగా ఉండే రాతి పొరలను ఎంపిక చేసి ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. భూమి ఉపరితలం నుంచి సుమారు 433 మీటర్ల లోతు వరకు ప్రత్యేక రంధ్రాలు, సొరంగ మార్గాలను నిర్మించారు. అణు విద్యుత్ కేంద్రాల నుంచి వచ్చే అత్యంత ప్రమాదకర రేడియోధార్మిక వ్యర్థాలను ప్రత్యేక రక్షణ కంటైనర్లలో ఉంచి ఈ భూగర్భ గదుల్లో భద్రపరుస్తారు. అనంతరం వాటిని శాశ్వతంగా మూసేస్తారు. ఇంత లోతులో నిల్వ చేయడం వల్ల భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులు లేదా ఇతర బాహ్య ప్రభావాల నుంచి వ్యర్థాలు సురక్షితంగా ఉంటాయి. అందుకే అంకాలోను ప్రపంచంలోనే అత్యంత సురక్షిత అణు వ్యర్థాల నిల్వ కేంద్రంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకుంది. ఫిన్లాండ్ అణు భద్రత ప్రాధికార సంస్థ నుంచి ఈ నెలలోనే తుది అనుమతులు లభించే అవకాశం ఉందని సమాచారం. అదే జరిగితే త్వరలోనే అంకాలో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. అణు విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే రేడియోధార్మిక వ్యర్థాలు మానవాళికి ప్రమాదం. ఈ వ్యర్థాల్లోని రేడియోధార్మికత పూర్తిగా తగ్గి, సహజసిద్ధ యురేనియం ధాతువు స్థాయికి చేరుకోవడానికి దాదాపు లక్ష సంవత్సరాలు పడుతుంది. అందుకే వాటిని అత్యంత సురక్షితంగా, దీర్ఘకాలం పాటు భద్రపరచే మార్గాల కోసం ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఫిన్లాండ్ లో నిర్మించిన ‘అంకాలో’ భూగర్భ నిల్వ కేంద్రం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. భూమికి వందల మీటర్ల లోతులో నిర్మించిన ఈ కేంద్రంలో అణు వ్యర్థాలను ప్రత్యేక కాపర్ క్యానిస్టర్లలో భద్రపరుస్తారు. ఒకసారి వ్యర్థాలను అక్కడ నిల్వ చేసిన తర్వాత అంకాలోను పూర్తిగా మూసేసి, దాదాపు లక్ష సంవత్సరాల పాటు అలాగే ఉంచేలా ప్రణాళిక రూపొందించారు. ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా, భవిష్యత్ తరాలు కూడా ఈ ప్రాంతాన్ని తవ్వకుండా ఉండేలా ప్రత్యేక హెచ్చరికలు, శాస్త్రీయ గుర్తులు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఈ నిల్వ కేంద్రం ప్రభావం కేవలం కొన్ని దశాబ్దాలకే కాదు, కొన్ని తరాల భవిష్యత్తుకూ సంబంధించినది. ఈ విధానం పూర్తిగా సేఫ్ కాదని నిపుణులు అంటున్నారు. కాలక్రమేణా కాపర్ క్యానిస్టర్లకు తుప్పు పట్టే అవకాశం ఉంది. అలాగే భూకంపాల పైనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నేళ్లగానో పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న అణు వ్యర్థాల సమస్యకు ఫిన్లాండ్ చూపించిన ఈ మార్గం నిజంగా భవిష్యత్తును మార్చే నిర్ణయంగా నిలుస్తుందేమో చూడాలి. మొదటి దశలో అణు కేంద్రాల్లో ఉపయోగించిన ఇంధన రాడ్లను ప్రత్యేక రక్షణ కవచాల్లో ఉంచుతారు. వాటి చుట్టూ తుప్పు పట్టకుండా ఉండేలా మందమైన కాపర్ క్యానిస్టర్లను అమర్చుతారు. ఈ కాపర్ పొర రేడియోధార్మిక పదార్థాలు బయటకు రాకుండా మొదటి రక్షణ కవచంగా పనిచేస్తుంది. ఆ తర్వాత ఈ క్యానిస్టర్లను భూమి ఉపరితలం నుంచి సుమారు 433 మీటర్ల లోతులో తవ్విన ప్రత్యేక రంధ్రాల్లో జాగ్రత్తగా ఉంచుతారు. ఈ రంధ్రాలు కోట్ల సంవత్సరాలుగా స్థిరంగా ఉన్న బలమైన రాతి పొరల మధ్య ఉండటంతో అదనపు భద్రత లభిస్తుంది. క్యానిస్టర్లను లోపల ఉంచిన తర్వాత వాటి చుట్టూ ‘బెంటోనైట్ క్లే’ అనే ప్రత్యేక మట్టిని నింపుతారు. ఈ మట్టికి ఒక విశేష గుణం ఉంది. నీరు లేదా తేమ తగిలినప్పుడు అది ఉబ్బి విస్తరిస్తుంది. దీంతో క్యానిస్టర్ చుట్టూ గట్టి సీల్ ఏర్పడి, నీరు లేదా ఇతర పదార్థాలు లోపలికి చేరకుండా అడ్డుకుంటుంది. ఈ విధంగా కాపర్ క్యానిస్టర్, బెంటోనైట్ క్లే, సహజ రాతి పొరలు అనే మూడు స్థాయిల రక్షణ వ్యవస్థ ద్వారా అణు వ్యర్థాలను వేల సంవత్సరాల పాటు సురక్షితంగా నిల్వ చేయాలనే లక్ష్యంతో అంకాలో ప్రాజెక్ట్‌ను రూపొందించారు. ఈ భూగర్భ కేంద్రంలో దాదాపు 6,500 టన్నుల యురేనియం ఆధారిత అణు వ్యర్థాలను నిల్వ చేసే సామర్థ్యం ఉంది. ఫిన్లాండ్‌లో ప్రస్తుతం పని చేస్తున్న మొత్తం ఐదు అణు రియాక్టర్లలో ఉపయోగించిన అణు ఇంధన రాడ్లను ఈ కేంద్రంలో భద్రపరుస్తారు. ఈ ప్రక్రియ ఒక్కరోజులో పూర్తయ్యేది కాదు. రాబోయే దాదాపు 100 సంవత్సరాల పాటు అణు కేంద్రాల నుంచి వచ్చే వ్యర్థాలను క్రమంగా ఈ భూగర్భ సొరంగాల్లో నిల్వ చేస్తారు. ప్రతి క్యానిస్టర్‌ను ప్రత్యేక రంధ్రాల్లో ఉంచి, బెంటోనైట్ క్లేతో సీల్ చేస్తూ భద్రతా ప్రమాణాలను పాటిస్తారు. అన్ని రంధ్రాలు నిండిన తర్వాతే అసలు కీలక దశ మొదలవుతుంది. అప్పుడు మొత్తం నిల్వ కేంద్రాన్ని శాశ్వతంగా మూసివేస్తారు. ఒకసారి సీల్ చేసిన తర్వాత దానిని మళ్లీ తెరవాలనే ఆలోచన కూడా ఉండదు. ఆ తర్వాత లక్ష సంవత్సరాల పాటు ఆ అణు వ్యర్థాలు భూమి అడుగునే ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అణు వ్యర్థాల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే ప్రయత్నంలో ఫిన్లాండ్ తీసుకున్న ఈ అడుగు ప్రపంచ అణుశక్తి రంగంలో ఒక చారిత్రాత్మక ప్రయోగంగా మారింది. ఇది విజయవంతమైతే, భవిష్యత్తులో మరెన్నో దేశాలు కూడా ఇదే తరహా భూగర్భ నిల్వ కేంద్రాలను నిర్మించే అవకాశం ఉంది. అందుకే దీనిని ప్రపంచంలోనే అత్యంత సురక్షిత అణు వ్యర్థాల నిల్వ కేంద్రంగా పలువురు నిపుణులు అభివర్ణిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కిటికీలు, అద్దాలతో పవర్ ప్రొడక్షన్.. ఈ టెక్నాలజీ వస్తే.. అందరికీ జీరో బిల్లులే
23 ఏళ్ల పోరాటం.. రూ.85 కోట్ల భరణం విడాకుల కేసులో ట్విస్ట్
బైక్ ట్యాక్సీ రైడర్‌గా.. ఓటమి భయం నుంచి బయటపడ్డాడు!
రూ.40 లక్షల జీతం.. బీఎండబ్ల్యూ కారు.. అయినా పేదవాడిగా ఫీలవుతున్నా!
