AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాన్నా కాపాడు అంటూ ఫోన్‌ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

నాన్నా కాపాడు అంటూ ఫోన్‌ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

Phani CH
|

Updated on: Jan 21, 2026 | 5:35 PM

Share

నోయిడాలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా యువరాజ్ తన కారుతో 70 అడుగుల లోతైన నీటి గుంతలో పడి మరణించాడు. దట్టమైన పొగమంచు, హెచ్చరిక బోర్డులు లేకపోవడమే ప్రమాదానికి కారణం. కొడుకు సహాయం కోసం కేకలు వేస్తుంటే విన్న తండ్రి గుండె పగిలింది. స్థానికుల నిరసనలతో అధికారులు గుంతను పూడ్చారు. ఈ విషాద ఘటన అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తోంది.

నాన్నా, నా కారు నీటి గుంతలో పడిపోయింది. నేను మునిగిపోతున్నా… దయచేసి వచ్చి కాపాడు. చచ్చిపోతానేమో అని భయంగా ఉంది…అంటూ తన బిడ్డ ఫోన్‌లో కేకలు వేస్తున్నా కాపాడుకోలేకపోయానని ఓ తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. కళ్లముందే కొడుకు ప్రాణాలు కోల్పోతే ఏమీ చేయలేక ఆ తండ్రి పడిన వేదన వర్ణనాతీతం. నోయిడాలో అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. బీహార్‌లోని సీతామఢికి చెందిన యువరాజ్, తన కుటుంబంతో కలిసి నోయిడా సెక్టార్ 150లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కమ్మేయడంతో పాటు, సర్వీస్ రోడ్డుపై ఎలాంటి హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు లేకపోవడంతో… అదుపుతప్పిన అతని కారు రోడ్డు పక్కనే నిర్మాణంలో ఉన్న 70 అడుగుల లోతైన, నీటితో నిండిన గుంతలో పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే యువరాజ్ తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. కారు నుంచి బయటకు వచ్చి, మునిగిపోతున్న కారు పైకప్పుపై నిలబడి, ఫోన్ టార్చ్ వేసి సహాయం కోసం అరుస్తూనే ఉన్నాడు. నాన్నా, నన్ను కాపాడు అంటూ అతను పెట్టిన కేకలు ఆ తండ్రి గుండెను పిండేశాయి. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న రాజ్‌కుమార్ మెహతా, పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు 15 నిమిషాల్లోనే వచ్చినా, లోతైన గుంత నుంచి కారును బయటకు తీసేందుకు అవసరమైన సరైన పరికరాలు వారి వద్ద లేవు. సహాయక చర్యలు ఆలస్యం కావడంతో, స్థానికులు, ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ మోనిందర్‌తో సహా కొందరు ఆ గుంతలోకి దిగి కాపాడేందుకు ప్రయత్నించారు. అనంతరం పోలీసులు, డైవర్లు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి కారుతో పాటు యువరాజ్‌ను బయటకు తీశారు. కానీ, అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. ఆసుపత్రికి తరలించేలోపే యువరాజ్ ప్రాణాలు విడిచాడు. తన కొడుకు ఎంతో కష్టపడి చదువుకుని ఉద్యోగం సంపాదించాడని, వాడిని కాపాడుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నించానని, కానీ కాపాడుకోలేకపోయానని, తన కళ్ల ముందే తన కుమారుడు చనిపోయాడంటూ తండ్రి రాజ్‌కుమార్ కన్నీరుమున్నీరయ్యారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు నాలెడ్జ్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సర్వీస్ రోడ్డుపై బారికేడ్లు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలని, ప్రమాదకరమైన గుంతలను మూసివేయాలని గతంలోనే స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని వారు ఆరోపించారు. ఈ దుర్ఘటన తర్వాత స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగారు. దీంతో అధికారులు వెంటనే స్పందించి, ఆ గుంతను చెత్త, శిథిలాలతో పూడ్చివేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vande Bharat: ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..

Tollywood News: టాలీవుడ్ షూటింగ్ అప్‌డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడు..?

సంక్రాంతి బ్లాక్‌బస్టర్.. మరి సమ్మర్ సినిమాల పరిస్థితేంటి

Anil Ravipudi: అనిల్ రావిపూడి అంటే పేరు అనుకుంటివా.. హిట్టులకు బ్రాడ్

కొత్త ఏడాది.. కొత్త హీరోయిన్లు.. ఇండస్ట్రీ అంతా కొత్తదనమే

Follow Us