లైంగిక దాడి నిందితుడితో బాధితురాలికి పెళ్లి.. చివరకు..

|

Jan 10, 2025 | 7:35 PM

తమ కుమార్తె పై పలుమార్లు లైంగికదాడికి పాల్పడిన వ్యక్తితో ఆమెకు పోలీసులు బలవంతంగా పెళ్లి జరిపించారని ఓ కుటుంబం ఆరోపించింది. నిందితుడిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా పోలీసులు ఇలా తమను బలవంతం చేశారని తెలిపింది. అయితే, బాధిత యువతి గర్భం దాల్చడంతోనే ఇలా చేయాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బదోహి జిల్లాలో జరిగిందీ ఘటన. అసలు పోలీసులు ఎందుకు అలా చేశారు?

బాధిత కుటుంబం ఫిర్యాదుతో కొత్వాలి ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల సాజిత్ అలీని ఆదివారం అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలు, నిందితుడు ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వారని, ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడటంతో నిందితుడు తరచూ బాధితురాలి ఇంటికి వెళ్లేవాడని అన్నారు. ఈ క్రమంలో గతేడాది మార్చి 10న ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. అనంతరం ఆ వీడియోను చూపించి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది.ఆమె శరీరంలో వస్తున్న మార్పులను గమనించి తల్లిదండ్రులు ఆరా తీయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. గతేడాది సెప్టెంబర్ 20న బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే, బాధితురాలు గర్భవతి కావడంతో నిందితుడు అలీతో పెళ్లికి ఒప్పించారు పోలీసులు. తన ఇష్టంతో పని లేకుండానే పోలీసులు పెళ్లి జరిపించారని బాధిత యువతి ఆరోపించింది. కాగా, నిందితుడు అలీకి ఇది వరకే వివాహమైందని బాధితురాలు అక్టోబర్‌లో గుర్తించింది. నవంబర్ 26న బాధిత యువతి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృత శిశువుకు జన్మనిచ్చింది. బాధితరాలు ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.