ఒక్క నిమ్మకాయ ఖరీదు రూ.5 లక్షలు.. ఇదే దీని ప్రత్యేకత!

Updated on: Feb 21, 2025 | 2:36 PM

మహాఅంటే ఎక్కువలో ఎక్కువ ఒక్క నిమ్మకాయ ఖరీదు 10 నుంచి 20 రూపాయలు ఉంటుంది. పోనీ 100 రూపాయలు అనుకుందాం. అంతేకానీ ఏకంగా ఒక్క నిమ్మకాయ లక్షల్లో ధర పలకడం ఎక్కడైనా చూశారా? పోనీ విన్నారా? అవును తమిళనాడులో ఒక్క నిమ్మకాయ ఖరీదు ఏకంగా రూ.5 లక్షల రూపాయలు పలికింది. మరి ఆ నిమ్మకాయ అంత ధర ఎందుకు పలికింది? దాని ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలనుందా? అయితే వాచ్‌ది స్టోరీ..

తమిళనాడులోని పుదుక్కోటై జిల్లా తిరువరుంగుళం వల్లనాట్టు చెట్టియార్‌ వర్గీయులు పళనిలో ఏటా మూడు రోజుల పాటు తైపూస ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అన్నదానం చేస్తారు. ఈ క్రమంలో స్వామి పాదాల వద్ద మూడు రోజుల పాటు రోజుకో నిమ్మకాయ పెట్టి పూజ చేస్తుంటారు. మూడు రోజుల తర్వాత వాటిని వేలం వేస్తారు. అలా వేలంలో నిమ్మకాయను భక్తులు పోటీపడి మరీ దక్కించుకుంటారు. ఈక్రమంలో ఇటీవల జరిగి తైపూప ఉత్సవాల్లో సుబ్రహ్మణ్యస్వామివారివద్ద ఉంచిన నిమ్మకాయలను వేలం వేశారు. ఒక్కో నిమ్మకాయ రూ. 16 వేల నుంచి రూ. 40 వేల వరకు ధర పలికింది. తైపూసం రోజున మురుగన్‌ అభిషేకం సమయంలో స్వామి పాదల వద్ద ఉంచిన నిమ్మకాయను మాత్రం ఓ భక్తుడు రూ. 5.09 లక్షలకు సొంతం చేసుకున్నాడు. స్వామి పాదాల వద్ద ఉంచిన నిమ్మకాయ తమ వద్ద ఉంటే శుభం జరుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకనే పూజలో పెట్టే నిమ్మకాయలను భక్తులు పోటీ పడి మరీ వేలంలో దక్కించుకుంటారు. కాగా, ఈ వేలంలో వల్లనాట్లు చెట్టియార్లు మాత్రమే పాల్గొంటారు.