పెళ్లయిన రెండో రోజు.. విద్యుత్ షాక్‌తో నవవరుడు మృ*తి వీడియో

Updated on: May 22, 2025 | 6:12 PM

కొడుకుకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి మురిసిపోయారు ఆ తల్లిదండ్రులు. కానీ విధికి ఆ కొత్త జంటను చూసి కన్నుకుట్టిందో ఏమో నవవరుణ్ణి కరెంట్ షాక్ రూపంలో కాటేసింది. భర్త మరణంతో మానసిక ఆవేదనకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయిన వధువు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మహబూబాబాద్ జిల్లాలో పెళ్ళింట విషాదం చోటుచేసుకుంది.

 పెళ్లయిన రెండో రోజే విద్యుత్ షాక్ తో నవవరుడు మృతి చెందాడు. బైహారం మండలం గౌరారం శివారు కోడిపుంజుల తండాలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో నల్ల మోటార్ కోసం స్విచ్ బోర్డులోని ప్లగ్ లోకి వదులుగా ఉన్న విద్యుత్ వైర్లను చుప్పించడానికి ప్రయత్నిస్తుండగా నరేష్ విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మరణించాడు. భర్త కళ్ళముందే మృతి చెందడంతో భార్య మానసికంగా డిస్టర్బ్ అయ్యి స్పృహతప్పి పడిపోయింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 18 ఆదివారం రోజున ఇస్లావాత్ నరేష్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కాంకిపాడు గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగింది. వేడుకకు హాజరైన బంధుమిత్రులు వారు కలకాలం చల్లగా ఉండాలని దీవించారు. సోమవారం ఉదయం నవదంపతులు వరుడి ఇంటికి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం వరుడి ఇంటి వద్ద రిసెప్షన్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.