యువకుడిని కాటేసి.. చచ్చిపోయిన పాము.. బాధితుడి మాటలు విని డాక్టర్లు షాక్‌

Updated on: Jun 27, 2025 | 5:39 PM

సాధారణంగా పాము మనిషిని కరిస్తే ఏమవుతుంది? కరిచిన పాము పెద్దగా విషపూరితమైనది కాకపోతే మనిషి అనారోగ్యానికి గురవుతాడు. అదే కాటు వేసింది విషపూరితమైనదైతే.. మనిషి క్షణాల్లోనే చనిపోతాడు. కానీ ఇక్కడ జరిగిన ఓ సంఘటన దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఓ యువకుడిని కాటేసిన పాము కేవలం ఐదు నిమిషాల్లోనే గిలగిల కొట్టుకుని ప్రాణాలు కోల్పోయింది.

అయితే, ఆ పాము కాటుకు గురైన యువకుడికి మాత్రం ఏ హానీ జరగలేదు. ఈ ఆశ్చర్యకర ఘటన మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలోని ఖుద్సోడి గ్రామంలో వెలుగు చూసింది. ఖుద్సోడి గ్రామానికి చెందిన సచిన్ నాగ్‌పురే అనే యువకుడు గురువారం పొలంలో పనిచేస్తుండగా అనుకోకుండా ఓ పామును తొక్కాడు. దీంతో ఆ పాము సచిన్‌ను కాటువేసింది. అయితే, ఆశ్చర్యకరంగా సచిన్‌‌ను కాటువేసిన ఆ పాము కొన్ని నిమిషాల్లోనే గిలగిలా కొట్టుకుంటూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కానీ సచిన్‌కు మాత్రం ఏ ప్రమాదమూ జరగలేదు. ఇంటికొచ్చాక.. ఇదే మాట కుటుంబ సభ్యులకు చెప్పగా, వారు హడావుడిగా సచిన్‌ను, అతడిని కాటేసిన పామును తీసుకుని డాక్టర్ల వద్దకు తీసుకుపోయి చూపించారు. అక్కడ సచిన్‌ను పరీక్షించిన వైద్యులు.. ఆ పామును డొంగర్ బేలియా జాతి పాము కాటేసిందని, అది అత్యంత విషపూరితమైన పాము అని నిర్ధారించారు. అయితే, సచిన్‌కు ఏమీ కాకపోవటంతో ఆశ్చర్యపోయిన వైద్యులు, అతడి అలవాట్ల గురించి ఆరా తీశారు. ఈ క్రమంలోనే సచిన్ కొన్నేళ్లుగా.. రోజూ..చిడ్చిడియా, పిసుండి, పల్సా, నేరేడు, మామిడి, తూవర్, ఆజన్, కానుగ, వేప వంటి చెట్ల పుల్లలతో పళ్లు తోముకుంటున్నాడని తెలుసుకున్నారు. సదరు ఔషధ మూలికల ప్రభావం వల్లనే సచిన్ రక్తం పాముకు విషంగా మారి అది చనిపోయి ఉండొచ్చని వైద్యులు అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ ఘటనపై స్థానిక అటవీశాఖ అధికారులు స్పందించారు. ఓ పాము మనిషిని కరిచి ప్రాణాలు కోల్పోవడం అత్యంత అరుదైన ఘటన అన్నారు. కొన్ని సందర్భాల్లో పాము కాటు వేసిన తర్వాత తన శరీరాన్ని బలంగా మెలితిప్పుతుందని.. ఇలాంటి సమయంలో దాని విషపుతిత్తి పగిలిపోయే అవకాశం ఉందని, దాని వల్ల కూడా పాము ఆకస్మికంగా మరణించవచ్చని వారు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అలాంటి వారిని వదిలిపెట్టను.. హెచ్చరించిన మంచు విష్ణు