చూపు మందగించిందని డాక్టర్ దగ్గరికి వెళ్లిన వ్యక్తి.. కంట్లో ఉన్న జీవిని చూసి వైద్యులు షాక్‌ వీడియో

Updated on: Aug 23, 2025 | 2:39 PM

సాధారణంగా కంటి సమస్యలంటే దృష్టి మసకబారడం, కంటిలో అసౌకర్యం, తలనొప్పి, కంటి నుండి నీరు కారడం లేదా కళ్ళు పొడిబారడం లాంటి సమస్యలు వస్తాయి. కొన్ని కంటి సమస్యలు తీవ్రంగా ఉండి, దృష్టి కోల్పోవడానికి కూడా దారితీయవచ్చు. కంటి వ్యాధులు అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. కొన్ని ప్రత్యక్ష కారణాలు అయితే మరికొన్ని ప్రమాదాల వల్ల కావచ్చు. కాగా ఓ వ్యక్తి చూపు మందగించిందని డాక్టర్‌ వద్దకు వెళ్లాడు. ఆ వ్యక్తిని పరీక్షించిన వైద్యులు సైతం షాక్‌కు గురయ్యారు. అతని కంటి లోపల ఒక పరాన్నజీవి పురుగు నెమ్మదిగా కదులుతుండటాన్ని గుర్తించారు.

మధ్యప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తికి ఎదురైన ఈ వింత అనుభవం వైద్య శాస్త్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ అరుదైన కేసుకు సంబంధించిన వివరాలను ప్రఖ్యాత ‘న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’ ప్రచురించింది. బాధితుడు కళ్లు మసకబారుతున్నాయని చెప్పడంతో వైద్యులు అతనికి ఫండోస్కోపీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో కంటి వెనుక భాగంలో ఒక పురుగు నెమ్మదిగా కదులుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. పరిశోధనలో దానిని ‘గ్నాథోస్టోమా స్పినిగెరమ్’ అనే పరాన్నజీవిగా గుర్తించారు. సాధారణంగా ఈ రకం పురుగులు పిల్లులు, కుక్కల వంటి జంతువులలో కనిపిస్తాయి. సరిగా ఉడకని చేపలు, కోడి మాంసం, పాములు లేదా కప్పల మాంసం తినడం ద్వారా ఇది మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తుందని వైద్యులు తెలిపారు. బాధితుడు కూడా గతంలో సరిగా ఉడకని మాంసం తిన్నట్లు అంగీకరించాడు. శరీరంలోకి ప్రవేశించిన ఈ పరాన్నజీవి, రక్త ప్రవాహం ద్వారా కంటికి చేరినట్లు వైద్యులు భావిస్తున్నారు. వెంటనే అతనికి ‘పార్స్ ప్లానా విట్రెక్టమీ (PPV) అనే ప్రత్యేకమైన శస్త్రచికిత్స చేసి, కంటిలోని పురుగును విజయవంతంగా తొలగించారు. అనంతరం దానిని మైక్రోస్కోప్ కింద పరీక్షించి గ్నాథోస్టోమాగా నిర్ధారించారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ నిపుణుడు డాక్టర్ అబ్ధిశ్‌ భవ్సర్ మాట్లాడుతూ.. ఇలాంటి పరాన్నజీవులు కంటి రెటీనాలోకి చేరితే తీవ్ర నష్టం కలిగిస్తాయని, కొన్నిసార్లు శాశ్వతంగా చూపును కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందని తెలిపారు. ఆహార పదార్థాలను, ముఖ్యంగా మాంసాహారాన్ని బాగా ఉడికించి తినడం ద్వారా ఇలాంటి ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం:

ఆసుపత్రిలోకి వచ్చిన ఎద్దు .. ఏం చేసిందంటే వీడియో

పెరట్లో వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా…హడల్‌ వీడియో

కూతురు అప్పగింతల వేళ అనుకోని ఘటన.. అయ్యో పాపం వీడియో