ఆ పని కోసం..రూ. కోటి వేతనం వదులుకున్నాడు వీడియో
కోటి రూపాయల శాలరీ, సౌకర్యాలు ఉన్న ఉద్యోగం ఉంటే చాలు.. సెటిలైనట్లే అని చాలామంది అనుకుంటారు. ఇంకొందరు..తమ అరాకొరా జీతంతో సరిపెట్టుకుంటూనే.. తమకు ఏదో ఒకనాడు అలాంటి అవకాశం రాకపోతుందా అని లెక్కలు వేసుకుంటుంటారు. అయితే, తాజాగా ఒక యువకుడు మాత్రం గర్భిణిగా ఉన్న తన భార్య మంచీ చెడూ చూసుకోవటానికి కోటి రూపాయలొచ్చే కొలువును వదిలేసుకున్నాడు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో ఆ వ్యక్తి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.గర్భవతి అయిన భార్యకు సహాయం చేయడానికి కోటి రూపాయల కంటే ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగాన్ని వదలిపెట్టినట్లు ఆ యువకుడు తెలిపాడు. ఒక సంవత్సరం విరామం తర్వాత రీ జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాడట. తాను కాలేజీ డ్రాపౌట్‌నని, అయితే గత 7 సంవత్సరాలలో బెంగళూరులో కెరీర్ పరంగా మంచి పురోగతి సాధించానని తన పోస్టులో రాసుకొచ్చాడు. తన భార్యకూడా ఉద్యోగం చేస్తోందని, ఆమె ఇంకా వర్క్ ఫ్రం హోమ్ చేస్తూనే ఉందని తెలిపాడు. ఇంటి పనిని తామిద్దరం పంచుకుంటామని రాసుకొచ్చాడు. తనకున్న అనుభవం, పరిచయాలతో ఎప్పుడైనా తిరిగి ఉద్యోగంలో చేరగలననే నమ్మకం ఉందనీ తెలిపాడు. తనకు సంవత్సరానికి రూ. 1.2 కోట్ల జీతం వస్తుందని ఆర్థికంగా నిలదొక్కుకున్నందుకు కృతజ్ఞుడిని అంటూ పోస్ట్‌లో తెలిపాడు. జీవితంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యమని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. భాగస్వామికి, పిల్లలకు, తల్లిదండ్రులకు మన అవసరమైనప్పుడు.. వారికోసం తప్పక టైం కేటాయించాల్సిందేనని రాసుకొచ్చాడు. కాగా, యువకుడి రెడ్డిట్ పోస్ట్‌పై నెటిజన్లు స్పందించారు. చాలా మంది ఉద్యోగాన్ని వదులుకునే సాహసం చేయరు మీరు అదృష్టవంతులు అంటూ కామెంట్లు పెట్టారు. తమకు కూడా మంచి జీతం ఉన్న ఉద్యోగం వస్తే కెరీర్ లో బ్రేక్ తీసుకుంటామని మరికొందరు వ్యాఖ్యానించారు.
మరిన్ని వీడియోల కోసం :