8 బతికిన కప్పల్ని మింగేసిన మహిళ.. కారణం తెలిస్తే షాకవుతారు

Updated on: Oct 14, 2025 | 5:38 PM

టెక్నాలజీ యుగంలో ఎన్నో అంతుచిక్కని వ్యాధులను ఆధునిక టెక్నాలజీ ద్వారా అరికడుతున్నారు. వైద్యులు సైతం గుర్తించలేని జబ్బులను కృత్రిమ మేథ సాయంతో గుర్తించి చికిత్సను అందిస్తున్న రోజులివి. అయితే.. ఇలాంటి ఆధునిక యుగంలోనూ కొందరు మూఢనమ్మకాలను, నాటువైద్యాన్ని వదలడంలేదు. ఓ వృద్ధురాలు నడుం నొప్పి తగ్గుతుందనే నమ్మకంతో.. బతికున్న కప్పలను మింగింది.

దీంతో, ఆమె నడుపు నొప్పి తగ్గకపోగా.. కడుపునొప్పి మొదలైంది. ఈ విచిత్ర ఘటన చైనాలో చోటు చేసుకుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం..తూర్పు చైనాకు చెందిన జాంగ్ అనే 82 ఏళ్ల వృద్ధురాలు చాలా కాలంగా హెర్నియేటెడ్ డిస్క్‌తో బాధపడుతుంది. ఈ క్రమంలో ఓ నాటువైద్యుణ్ణి సంప్రదించింది. అతను బతికి ఉన్న కప్పలను మింగితే వెన్నునొప్పి తగ్గుతుందని చెప్పారు. అంతే..ఆమె ఇంట్లోవారికి చెప్పకుండా తనకు అరచేతి కంటే చిన్నగా ఉండే బతికున్న కప్పలను తెచ్చిపెట్టాలని కుటుంబ సభ్యులకు తెలిపింది. దేనికి అని అడిగినా.. ఆమె వారికి అసలు విషయం చెప్పలేదు. దీంతో.. కుటుంబ సభ్యులు ఆమె కోరినట్లే.. కప్పలను పట్టి తీసుకువచ్చారు. దీంతో ఆమె గత సెప్టెంబర్‌ మొదటి వారంలో వాటిని శుభ్రం చేయకుండా, బతికుండగానే మొదటి రోజు మూడు కప్పలను, మరుసటి రోజు ఐదు కప్పల చొప్పున మింగేసింది. దీంతో నడుంనొప్పి తగ్గకపోగా.. కాసేపటికే తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. దీంతో ఆమె తన కుటుంబ సభ్యులను పిలిచి కప్పలను మింగిన సంగతి వెల్లడించింది. దీంతో వారు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు ఆమె కడుపులో కప్పలు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. వైద్య పరీక్షల్లో కప్పలలో ఉండే టేప్‌వార్మ్ లార్వా అనే స్పార్గనమ్‌తో పాటు, ఇతర బ్యాక్టీరియా ఆమె కడుపులో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సజీవ కప్పలను మింగడంతో ఆమె జీర్ణవ్యవస్థలో ఇన్‌ఫెక్షన్‌ సోకి దెబ్బతిందని నిర్ధారించారు. ఆమె పొట్టలో చేరిన పరాన్నజీవులను వదిలించేందుకు రెండు వారాలపాటు చికిత్స అందించి.. మొత్తానికి ఆమెను కాపాడారు. ఏదైనా అనారోగ్యం ఉంటే డాక్టరును కలవాలి తప్ప ఇలాంటి నాటు వైద్యాలు వద్దని మందలించి.. డిశ్చార్జ్ చేశారు. అవగాహన లేకుండా ఇటువంటి నాటు వైద్యాలను అనుసరిస్తే కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన మాదిరి అవుతుందని వైద్యులు హెచ్చరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శోభితతో నా పరిచయం అక్కడే… వైరల్‌గా చైతూ కామెంట్స్

శతాయువు కోసం జపనీయుల పంచతంత్రం

UPI payments: ఇక.. ఫేస్‌, ఫింగర్‌ప్రింట్‌తోనే UPI చెల్లింపులు

పాముల భయంతో.. కార్తికేయను మిస్‌ చేసుకున్న స్టార్ హీరో..

చీమలు తయారుచేసిన యోగర్ట్‌ ను చూశారా