చెవులు కుట్టించబోతే చనిపోయిన బిడ్డ.. అసలేం జరిగింది? వీడియో
చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి వారికి ఓ ఐదేళ్లు వచ్చే వరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. పురుడు, బారసాల, నామకరణం, అన్నప్రాసన, చెవులు కుట్టించడం, పుట్టు వెంట్రుకలు తీయడం, ఆడ పిల్లలు అయితే గాజులు వేయడం ఇలా ప్రతీ దాన్ని పండగలాగే జరుపుతారు. అలాంటి ఓ కార్యక్రమమే చేయబోయిందో కుటుంబం. ముఖ్యంగా తమ ఆరు నెలల శిశువుకు చెవులు కుట్టించాలనుకున్నారు. అయితే ఇదే వారు చేసిన తప్పులా మారింది. కర్ణాటకలోని చామరాజ నగర్ జిల్లా హంగల గ్రామానికి చెందిన ఆనంద్, శోభ దంపతులకు ఇటీవలే పండంటి మగ బిడ్డ జన్మించాడు.
కొడుకు పుట్టినప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్న ఈ కుటుంబం.. బాలుడికి సంప్రదాయ బద్ధంగా చేయాల్సిన అన్ని కార్యక్రమాలను చేస్తూ వస్తోంది. అయితే చిన్నారికి ఆరు నెలలు నిండగా చెవులు కుట్టించాలని భావించారు. అయితే అంత చిన్న పిల్లాడికి చెవులు కుట్టిస్తే నొప్పి భరించలేక ఏడుస్తాడని ఆలోచించారు.కుటుంబం అంతా కలిసి ఆలోచించి మరీ చిన్నారికి చెవులు నొప్పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో నిర్ణయించింది. ముఖ్యంగా బాలుడికి మత్తు సూది ఇప్పిస్తే.. నొప్పి తెలియదని అప్పుడు చెవులు కుట్టిస్తే బాబు ఏడవకుండా ఉంటాడని అనుకున్నారు. ఈ క్రమంలోనే బొమ్మలాపుర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి అక్కడి వైద్యులకు ఈ విషయం చెప్పారు. తమ కుమారుడికి మత్తు సూది ఇస్తారో లేదో కనుక్కున్నారు. అయితే అక్కడే ఉన్న వైద్యుడు ఇస్తామని అందుకు 200 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో కుటుంబం చెవులు కుట్టించుకోవడానికి ముహూర్తం కూడా పెట్టుకుంది.