కుంగుతున్న నగరాలు..మునుగుతున్న పట్టణాలు

Updated on: Jan 13, 2026 | 10:07 AM

మన దేశంలో చెన్నై, అహ్మదాబాద్‌, కోల్‌కతా నగరాలు భూమిలోకి దిగబడిపోతున్నాయి. ఆధునికంగా ప్రపంచం ఎంత ముందుకు వెళుతున్నా, పర్యావరణ పరంగా అంతకంతకూ దిగజారుతోంది. వాతావరణ మార్పులతో ప్రపంచంలోని చాలా దేశాలు, అందులోని నగరాలు, పట్టణాలు భూమిలోపలికి కుంగిపోతున్నాయి. విచ్చలవిడిగా భూగర్భ జలాలు తోడేయడం, ఆకస్మిక వరదలు నగరాలను ముంచెత్తడం, భారీ నిర్మాణాలు, వాతావరణ మార్పులు ముఖ్య కారణాలుగా చెబుతున్నారు.

ఇండోనేషియా రాజధాని జకార్తా కొత్త రాజధాని ‘నుసంతర’కు తరలిపోతోంది. జకార్తా ఇప్పటికే కోటి మందికి పైగా జనాభాతో కిక్కిరిసింది. సముద్ర తీరంలోని జకార్తా ఏటేటా కొన్ని సెంటీమీటర్లు భూమిలోకి కుంగిపోతోంది. 2050 నాటికి జకార్తాలోని మూడింట ఒక వంతు సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉంది. అయితే ఇండోనేషియా నిర్మిస్తున్న కొత్త రాజధాని పై పర్యావరణవేత్తలు, స్థానిక ప్రజలు నిరసన ప్రకటిస్తున్నారు. రెండున్నర లక్షల హెకార్ల భూమిని సేకరిస్తున్నారు. దీంతో ఆ అటవీ ప్రాంతంలో ఒరాంగుటాన్ వంటి అరుదైన అటవీ జంతువుల మనుగడకు ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉంది. స్థానిక గిరిజన జాతులు తమ స్వస్థలాలను వీడేందుకు ఇష్టపడటం లేదు. విపరీత కాలుష్యం కారణంగా వాతావరణ మార్పులు పెరిగి, అంటార్కిటికాలో గత 25 ఏళ్ళలో మునుపెన్నడూ లేనంతగా 3 లక్షల టన్నుల మంచు కరిగిపోయింది. దీంతో సముద్రమట్టాలు 9 మిల్లీమీటర్ల మేర పెరిగ తీర ప్రాంతాల్లో ఉండే దేశాలకు, నగరాలను ముంచేస్తోంది.