22 ఏళ్లకే రూ. 8 వేల కోట్ల ఆస్తి అమెరికాలో మనోళ్ల సత్తా ఇదీ
భారత సంతతి టెకీలు ఆదర్శ్ హిరేమత్, సూర్య మిధా 22 ఏళ్ల వయసులోనే అమెరికాలో 'సెల్ఫ్ మేడ్ బిలియనీర్లు' అయ్యారు. చిన్న వయసులో 'సెల్ఫ్ మేడ్ బిలియనీర్' అయిన రికార్డు ఇప్పటిదాకా మార్క్ జుకర్‌బర్గ్ పేరిట ఉండేది. ఆయన 2008లో 23 ఏళ్ల వయసులో బిలియనీర్ అయ్యారు. మన ఆదర్శ్ హిరేమత్, సూర్య మిధాలు ఇంతకంటే తక్కువ వయసులోనే బిలియనీర్లుగా ఎదిగి, జుకర్‌బర్గ్ రికార్డును తిరగ రాశారు.
వీరిద్దరూ బ్రెండన్ ఫుడీ అనే తమ క్లాస్‌మేట్‌తో కలిసి ‘మెర్కోర్’ను స్థాపించారు. మెర్కోర్ కంపెనీ ఇటీవలే రూ.3,100 కోట్ల నిధులను సమీకరించింది. ప్రస్తుతం దాని మార్కెట్ విలువ దాదాపు రూ.88 వేల కోట్లుగా ఉంది. మెర్కోర్ కు సీఈఓగా బ్రెండన్ ఫుడీ, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా ఆదర్శ్ హిరేమత్, కంపెనీ బోర్డు ఛైర్మన్‌గా సూర్య మిధాలు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కంపెనీ ఆర్థిక పురోగతి వల్ల ఈ ముగ్గురు చిన్న వయసులోనే సెల్ఫ్ మేడ్ బిలియనీర్లుగా ఎదిగారని ఫోర్బ్స్ తెలిపింది. వ్యక్తిగత సంపద రూ.8 వేల కోట్లు దాటిన అమెరికన్ టెక్ కంపెనీల వ్యవస్థాపకుల జాబితాలో కూడా బ్రెండన్ ఫుడీ, ఆదర్శ్ హిరేమత్, సూర్య మిధాలకు టాప్ ర్యాంకులు దక్కాయి. సూర్య మిధా తల్లిదండ్రులు న్యూఢిల్లీ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లోని ఉన్న బెల్లార్మైన్ కాలేజ్ ప్రిపరేటరీ పాఠశాలలో ఆదర్శ్ హిరేమత్, సూర్య మిధా చదువుకున్నారు. స్కూలులోని డిబేట్ టీమ్‌లో ఆదర్శ్, సూర్య కలిసి ఉండేవారు. ఒకే సంవత్సరంలో మూడు జాతీయ స్థాయి డిబేట్ పోటీల్లో గెలిచిన రికార్డు వీరి టీమ్ సొంతం. ఆదర్శ్ హిరేమత్ హార్వర్డ్ లో కంప్యూటర్ సైన్స్ కోర్సు చేశాడు. మెర్కోర్ కంపెనీ ప్రారంభించడం కోసం కంప్యూటర్ సైన్స్ కోర్సును మధ్యలోనే రెండేళ్ల తర్వాత వదిలేశాడు. ఇంకో రెండు నెలలు చదివి ఉంటే, కంప్యూటర్ సైన్స్ కోర్సు పట్టా వచ్చి ఉండేది. ఆ రెండు నెలలను త్యాగం చేసి, హుటాహుటిన మెర్కోర్ కంపెనీని ఏర్పాటుచేయబట్టే తాను సక్సెస్ అయ్యానని ఆదర్శ్ హిరేమత్ అంటున్నాడు. బ్రెండన్ ఫుడీ, సూర్య మిధా జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో విదేశీ అధ్యయనాల విభాగంలో బ్యాచిలర్స్ కోర్సుల్లో చేరారు. హార్వర్డ్ వర్సిటీలో ఆదర్శ్ హిరేమత్ చదువును మానేసిన వెంటనే, వీరిద్దరు జార్జ్‌టౌన్ వర్సిటీలో చదువుకు స్వస్తి పలికారు. ఆదర్శ్ హిరేమత్‌కు చెందిన హాస్టల్ రూం నుంచే టెక్ కంపెనీ మెర్కోర్ కార్యకలాపాలను ప్రారంభించారు. ఈ ముగ్గురికి కూడా ప్రముఖ టెక్ వ్యాపార దిగ్గజం పీటర్ థీల్ ఏర్పాటు చేసిన థీల్ ఫెలోషిప్ లభించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రభుత్వ కార్యాలయానికి వచ్చిన కోతి.. నేరుగా వెళ్లి
తలుపు తీసి ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి.. గదిలో సీన్ చూసి షాక్
