అధికారుల నిర్లక్ష్యం..నాలాలో బాలుడు..
హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ మలక్‌పేట్ కాగజ్ నగర్‌లో తెరిచి ఉన్న నాలాలో పడి ఆరేళ్ల బాలుడు ప్రాణాపాయ స్థితిలో పడిపోయాడు. ఎటువంటి భద్రతా చర్యలు, హెచ్చరిక బోర్డులు లేకుండా నాలా పనులు కొనసాగిస్తుండటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాలుడు నాలాలో పడి కొట్టుకుపోతుండగా, గమనించిన ఓ స్థానికుడు ప్రాణాలకు తెగించి వెంటనే స్పందించాడు. అత్యంత సమయస్ఫూర్తితో బాలుడిని బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పి ఆ చిన్నారి ప్రాణాలు దక్కాయి. ఈ ఘటనతో స్థానికులు జీహెచ్‌ఎంసీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల బాధ్యతారాహిత్యం వల్ల గతంలోనూ ఇలాంటి విషాదాలు జరిగాయని, ఇప్పటికైనా మేల్కోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం.. రెహమాన్ అనే ఆరేళ్ల బాలుడు సాయంత్రం 5:30 గంటల సమయంలో తన సోదరితో కలిసి ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో వారి బాల్ నాలాలో పడింది. దాన్ని తీసే క్రమంలో రెహమాన్ అదుపుతప్పి లోతైన నాలాలో పడిపోయాడు. బాలుడి సోదరి కేకలు వేయడంతో గమనించిన లక్ష్మణ్ అనే స్థానికుడు, ఏమాత్రం ఆలోచించకుండా నాలాలోకి దూకి బాలుడిని సురక్షితంగా బయటకు తీశాడు.గత జనవరి 10 నుంచి ఈ నాలా పనులు సాగుతున్నప్పటికీ, ఇప్పటివరకు పూర్తి చేయకుండా అలాగే వదిలేశారని స్థానికులు మండిపడుతున్నారు. జన సంచారం ఉండే ప్రాంతంలో కనీస హెచ్చరిక బోర్డులు లేదా రక్షణ కవచాలు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న బీఆర్ఎస్ నాయకుడు పగ్గిళ్ల నర్సింగ్ అధికారుల తీరుపై పోలీసులకు, జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి, మరో ప్రమాదం జరగకముందే నాలా పనులను పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
స్పిరిట్ కథలో అవే హైలైట్స్ !
గ్లోబల్ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్
ఉస్తాద్ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ