AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!

వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!

Phani CH
|

Updated on: Aug 16, 2026 | 5:05 PM

Share

హిమాచల్‌ప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు 60 పైసల చొప్పున ‘వితంతు, అనాథల సెస్‌’ను ప్రభుత్వం విధించింది. ఆగస్టు 12 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. వితంతువులు, అనాథల సంక్షేమ పథకాలకు నిరంతర నిధులు సమకూర్చడమే లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇప్పటికే ఉన్న భారీ అప్పుల నేపథ్యంలో ఈ అదనపు భారం వాహనదారులపై ప్రభావం చూపుతుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో సెస్‌ను రూ.5 వరకు పెంచే అవకాశం కూడా ఉంది.

హిమాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వం.. వాహనదారులపై అదనపు భారం మోపింది. రాష్ట్రంలో విక్రయించే ప్రతి లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 60 పైసల చొప్పున ‘వితంతు, అనాథల సెస్’ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నూతన ధరలు ఆగస్టు 12 బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. రాష్ట్ర పన్నులు, ఎక్సైజ్ శాఖ ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతానికి లీటర్‌కు 60 పైసలు విధిస్తున్నప్పటికీ, చట్టప్రకారం దీన్ని భవిష్యత్తులో రూ.5 వరకు పెంచే అవకాశం ఉండటంతో వాహనదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలోనే ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వితంతువులు, అనాథల సంక్షేమ పథకాలకు బడ్జెట్‌తో సంబంధం లేకుండా నిరంతరం నిధులు సమకూర్చేందుకే ఈ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రతిపక్షాల నిరసనల మధ్య ఈ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. అయితే సంక్షేమం పేరుతో విధిస్తున్న ఈ సెస్ భారం సామాన్యులతో పాటు అదే వర్గాల వారికీ చుట్టుకుంటుందని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రం ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. హిమాచల్ ప్రదేశ్‌పై ఇప్పటికే రూ.1,04,000 కోట్లకు పైగా అప్పుల భారం ఉంది. దీనికి తోడు 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాబోయే ఐదేళ్లలో రాష్ట్రానికి సుమారు రూ.35,000 కోట్ల రెవెన్యూ లోటు గ్రాంట్లు నిలిచిపోనున్నాయి. సొంత ఆదాయాన్ని పెంచుకునే మార్గాల్లో భాగంగానే కేంద్రం ఇచ్చే సెస్సుల బాటలో రాష్ట్రాలు కూడా ఇలాంటి ప్రత్యేక పన్నులు వసూలు చేస్తున్నాయి. కేరళ, ఆంధ్రప్రదేశ్, గోవా వంటి రాష్ట్రాలు వివిధ అవసరాల కోసం సెస్ వసూలు చేస్తుండగా, వితంతువులు, అనాథల సంక్షేమం కోసం ఈ పన్ను విధించడం హిమాచల్‌లో తొలిసారి కావడం గమనార్హం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? అయితే ఈ డేంజర్ బెల్స్ మోగినట్టే!

వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు.. ఈ ఊరిలో కన్నీటిని మరిపించే అద్భుతం!

స్పోర్ట్స్ బ్యాగు తెరిచిన యువకుడు.. లోపలున్నది చూసి పరుగో పరుగు!

Follow Us