గంగిరెద్దుల కాలనీ చూసొద్దాం.. సంక్రాంతి సంబరాల్లో వీటి విన్యాసాలే వేరు!

Updated on: Jan 15, 2026 | 12:31 PM

తెలుగు సంస్కృతికి ప్రతీకలు డూడూ బసవన్నలు.. ఆ బసవన్నల సందడి లేని సంక్రాంతిని ఊహించుకోలేం. డూడూ బసవన్నలను అలంకరించడంలో చాలా కళాత్మకత ఉంటుంది. అలాంటిది.. విశాఖలో ప్రత్యేకంగా గంగిరెద్దుల కాలనీయే ఉందంటే నమ్ముతారా? తరతరాలుగా ఇదే వృత్తిని నమ్ముకుని ఆ కుటుంబాలు జీవిస్తున్నాయి. దాదాపు 50 కుటుంబాలు.. చిన్న ముసడివాడ ప్రాంతంలోని గంగిరెద్దుల కాలనీలో నివాసముంటున్నాయి. పూర్వం తాతలు, తండ్రులు చేపట్టిన ఈ వృత్తిని ఇప్పుడు వారి వారసులు కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్లు తిన్నా తినకపోయినా.. ఈ వృషభాలకు మాత్రం ఆహారం పెడుతూ ఆలనా పాలనా చూసుకుంటారు.

పండుగ సమయాల్లో వీధుల్లో తిరుగుతూ ప్రతీ ఇంటికి వెళ్తారు. పండగ సమయంలోనే వీరికి ఆదరణ. ఆ సమయంలో వచ్చే కానుకలు, డబ్బులతో.. ఈ మూగజీవాలను పోషిస్తుంటారు. తమకు జీవనాధారమైన ఈ గంగిరెద్దులను దైవం కంటే ఎక్కువగా పూజిస్తుంటాయి ఈ కుటుంబాలు. మిగిలిన సమయాల్లో మహిళలు వేరువేరు వృత్తుల్లో ఉంటారు. పండుగలప్పుడు ఈ గంగిరెద్దులను అందంగా ముస్తాబు చేస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలు, పట్టణాలు ఉత్సాహంగా కళకళలాడుతుంటాయి. ఈ సంబరాలకు మరింత అందాన్ని చేకూర్చేవి డుడు బసవన్నలు. చేతిలో సన్నాయి పట్టుకొని గంగిరెద్దులను అందంగా అలంకరించి బయలుదేరుతారు. అద్భుతమైన రంగులతో, నగలతో, పూలతో ముస్తాబు చేస్తారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా డుడు బసవన్నలను తీసుకుని గ్రామాలలో ఊరేగింపులు నిర్వహిస్తారు. ఈ ఊరేగింపులను చూడటానికి చాలా మంది ప్రజలు వస్తారు. ఈ విధంగా డుడు బసవన్నల విన్యాసాలు.. సంక్రాంతి సంబరాలకు మరింత వైభవాన్ని చేకూర్చుతాయి.