ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ వివాహం జరుగుతోంది. బంధుమిత్రులతో ఆ ప్రాంగణమంతా కోలాహలంగా ఉంది. ఎప్పుడు వచ్చిందో, ఎక్కడ్నుంచి వచ్చిందో.. ఎలా వచ్చిందోకానీ ఓ చిరుతపులి అక్కడికి వచ్చింది. నేనూ అతిథినే అన్నట్టుగా ఓ చోట కూర్చుని చక్కగా పెళ్లి తంతును చూస్తూ ఉంది. మొత్తానికి ఎవరో ఈ చిరుతను గమనించారు. దెబ్బకు కేకలు పెట్టడంతో ఆ ప్రాంగణమంతా క్షణాల్లో గందరగోళంగా మారిపోయింది. అతిథులంతా తలో దిక్కూ పరిగెత్తారు. కొందరు అటవీ అధికారులకు సమాచారమివ్వడంతో వారు పశువైద్యులను వెంటపెట్టుకొని ఘటనాస్థలికి చేరుకున్నారు. పశువైద్యుల సహాయంతో అటవీ సిబ్బంది చిరుతను పట్టుకునేందుకు ఆపరేషన్ స్టార్ట్ చేశారు. దాదాపు రెండున్నర గంటలపాటు శ్రమించి చిరుతను బంధించి తీసుకెళ్లారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.