కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
ముంబైలో పృథ్వీరాజ్ బోహ్రా అనే వ్యక్తి డబ్బులు తీసుకుని ప్రజల బాధలు వినడం, ఏకంగా కలిసి ఏడ్వడం వంటి వింత సేవతో వైరల్ అయ్యారు. చిన్న బాధలకు రూ.250, పెద్ద బాధలకు రూ.500, ఏడవడానికి రూ.1000 వసూలు చేస్తున్నారు. ఇది నగరాల్లో పెరిగిపోతున్న ఒంటరితనం, మానసిక ఒత్తిడికి నిదర్శనమని కొందరు వాదిస్తుంటే, మరికొందరు 'అద్భుతమైన స్టార్టప్' అంటున్నారు. అయితే, ఇది మానసిక ఆరోగ్య సమస్యలను పెంచే ప్రమాదంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో మీ బాధలు వినే ఓపిక ఎవరికీ ఉండటం లేదు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు.. ముంబై వంటి మెట్రో నగరాల్లో మనిషికి మనిషి తోడు ఉండటం అరుదైపోయింది. సరిగ్గా ఇదే అంశాన్ని ఆ వ్యక్తి తన వ్యాపారంగా మలుచుకున్నాడు. చిన్న బాధలైతే రూ.250.. వెయ్యిస్తే కలిసి ఏడుస్తానంటూ ఆ వ్యక్తి ముంబయి బీచ్‌లో పోస్టర్‌తో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పృథ్వీరాజ్ బోహ్రా ముంబయి బీచ్‌లో ఓ పోస్టర్ పట్టుకొని కూర్చున్నాడు. బాధతో ఉన్న వారు తన వద్దకు వచ్చి తమ కష్టాలను చెప్పుకోవచ్చని అన్నాడు. ఓపికగా బాధలు విన్నందుకు అందుకు తగ్గ మొత్తంలో డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు. చిన్న బాధలు వినడానికి రూ.250, పెద్ద బాధలైతే రూ.500, బాధలో ఉన్న వాళ్లతో కలిసి ఏడవాలనుకుంటే రూ.1000 తీసుకుంటానని చెప్పుకొచ్చాడు. ఈ వింత సర్వీస్‌ను చూసి అక్కడి ప్రజలంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ప్రజలు తన వద్దకు వచ్చి.. డబ్బులు చెల్లించి మరీ తమ కష్టాలు చెప్పుకొంటున్నట్లు పృథ్వీరాజ్ తెలిపాడు. తనకు ఇన్‌స్టాగ్రామ్ పేజీ, యూట్యూబ్ ఛానెల్ కూడా ఉన్నట్లు తెలిపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు ఇదేం పిచ్చి పని అని నవ్వుకుంటుంటే.. మరికొందరు మాత్రం సమాజంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, ఒంటరితనం వంటి సమస్యలను ఈ ఘటన ప్రతిబింబిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు దీనిని ‘అద్భుతమైన స్టార్టప్ ఐడియా’ అని కొనియాడుతుంటే, మరికొందరు మాత్రం నగరాల్లో పెరిగిపోతున్న ఒంటరితనానికి ఇది పరాకాష్ట అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మెట్రో నగరాల్లో మనుషులు ఎంత ఒంటరి వాళ్లయిపోయారో ఈ ఘటన చూస్తే అర్థమవుతోంది. చివరికి కన్నీళ్లు పంచుకోవడానికి కూడా డబ్బులు చెల్లించాల్సి రావడం బాధాకరం’ అని ఒక నెటిజన్ కామెంట్ హైలెట్‌గా మారింది. డిప్రెషన్‌తో బాధపడుతున్న వాళ్ళు సైకాలజిస్ట్ దగ్గరకు వెళ్లాల్సి వస్తే డబ్బు ఖర్చవుతుందని ఇలాంటి వారిని ఆశ్రయించే ప్రమాదం ఉందని కొందరు విమర్శిస్తున్నారు. వీరు సమస్య కు పరిష్కారం చూపకపోగా తమ అజ్ఞానంతో సమస్యను మరింత పెంచితే అప్పుడు బాధితుల పరిస్థితేంటని ప్రశ్నించారు. ఏది ఏమైనా, బాధలను కూడా ఒక వ్యాపార వస్తువుగా మార్చిన ఈ ‘ముంబై బీచ్ మ్యాన్’ ఐడియా నెట్టింట చర్చనీయాంశమైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఎంత అమానవీయం !! ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా.. గజరాజు వైరల్ వీడియో
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే.. బ్యాంక్‌కు రూ. 3 లక్షల జరిమానా
అసెంబ్లీని షేక్ చేసిన ‘స్నేక్’.. బడ్జెట్ వేళ మీడియా పాయింట్‌లో పాము హల్‌చల్