బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు
మదురైలో విషాదం చోటుచేసుకుంది. బరువు తగ్గడం కోసం యూట్యూబ్‌లో చూసిన వెంకారమ్ బోరిక్ పౌడర్‌ను సేవించిన 19 ఏళ్ల కలైయరసి ప్రాణాలు కోల్పోయింది. సోషల్ మీడియాలో వచ్చే నిరాధారమైన వైద్య చిట్కాలు ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి నిరూపించింది. బోరిక్ పౌడర్ వంటి రసాయనాలు అంతర్గత అవయవాలను దెబ్బతీసి ప్రాణాంతకం కాగలవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి చిట్కాలను నమ్మవద్దని పోలీసులు, వైద్యులు ప్రజలకు సూచిస్తున్నారు.
బరువు తగ్గడం ఎలా అన్న చిట్కాలున్న సోషల్ మీడియాలో వీడియోలు ప్రాణాంతకమని మరోసారి రుజువైంది. తమిళనాడులోని మదురై జిల్లా సెల్లూరు పరిధిలో జరిగిన ఓ ఘటన కలకలం రేపుతోంది. దినసరి కూలీ వేల్ మురుగన్ కుమార్తె 19 ఏళ్ల కలైయరసి..డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. కలైయరసి అధిక బరువుతో బాధ పడుతోంది. ఎలాగైనా సరే బరువు తగ్గాలని నిర్ణయించుకున్న ఆమె.. సోషల్ మీడియాలో చిట్కాలు వెతకడం ప్రారంభించింది. గత వారం యూట్యూబ్‌లో.. శరీరంలోని కొవ్వును కరిగించి స్లిమ్‌గా మార్చే వెంకారమ్ బోరిక్ పౌడర్ అనే పేరుతో ఉన్న ఒక వీడియో చూసింది. వీడియోలో చెప్పిన మాటలను నిజమని నమ్మిన కలైయరసి.. నాటు మందుల దుకాణం నుంచి వెంకారమ్ బోరిక్ పౌడర్ కొంది. మరుసటిరోజు ఆ పొడిని సేవించింది. అది తిన్న కొద్ది సేపటికే ఆమెకు తీవ్రమైన వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. కంగారుపడిన తల్లి సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. దీంతో అక్కడి వైద్యులు ఆమెకు ప్రాథమిక చికిత్స చేసి ఇంటికి పంపించారు. కానీ సాయంత్రానికి ఆమె పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. తీవ్రమైన కడుపు నొప్పి, మలంలో రక్తం పడటంతో ఆమె విలవిల్లాడిపోయింది. తన తండ్రిని పట్టుకుని ఏడుస్తూ నరకయాతన అనుభవించింది. రాత్రి 11 గంటల సమయంలో పరిస్థితి పూర్తిగా విషమించడంతో.. ఇరుగుపొరుగు వారి సహాయంతో ఆమెను ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది. ఆసుపత్రికి చేరుకునే లోపే కలైయరసి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సాధారణంగా బోరిక్ పౌడర్‌ను శుభ్రపరిచే రసాయనంగా ఉపయోగిస్తారు. ఇది మనుషులు తీసుకోవడం వల్ల అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతింటాయి. కలైయరసి విషయంలోనూ అదే జరిగింది. ఫలితంగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే అరకొర వైద్య చిట్కాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని.. పాటించవద్దని వైద్య నిపుణులు, పోలీసులు ప్రజలను తీవ్రంగా హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దుర్గమ్మ ఆలయం నుంచి ఫోన్ కాల్..నమ్మారో..అంతే సంగతులు
పండుగ కోసం ఊరెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి ఇంట్లో..
ఎడారి నేలలో యాపిల్స్, దానిమ్మను పండించిన మహిళా రైతు
ప్రియుడితో కలిసి భర్త మర్డర్.. ఇక తెల్లార్లు అదే పని
మేడారం జాతర ఏరియల్ వ్యూ కోసం హెలికాప్టర్ రైడ్స్.. డిస్కౌంట్ కూడా..