కూతురు చనిపోయి ఏడుస్తుంటే.. లంచాల కోసం జలగల్లా పీడించారు
బెంగుళూరులో గుండెను మెలిపెట్టే ఘటన వైరల్‌గా మారింది. ఒక్కగానొక్క కుమార్తె చనిపోయిన దుఃఖంలో తాను ఏడుస్తుంటే.. ఫార్మాలిటీస్ పూర్తి చేసేందుకు అంబులెన్స్ డ్రైవర్ దగ్గర నుంచి పోలీసు అధికారి వరకు లంచాల కోసం పీడించుకొని తిన్నారని ఓ తండ్రి ఆవేదనతో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తన కుమార్తె మరణం తర్వాత ఫార్మాలిటీస్ పూర్తి చేసేందుకు అంబులెన్స్ డ్రైవర్ నుంచి పోలీసు అధికారులకు లంచాలు చెల్లించాల్సి వచ్చిందనీ భారత్ పెట్రోలియం మాజీ సీఎఫ్‌ఓ శివకుమార్ రాసుకొచ్చారు. బిడ్డ పోయిన దుఃఖంలో తామున్న సంగతి తెలిసీ.. ఏమాత్రం సానుభూతి లేకుండా తనను లంచం పేరుతో కాల్చుకు తినటం దారుణమనీ రాసుకొచ్చారు. తాను డబ్బు చెల్లించగల స్థితిలో ఉన్నాను గనుక చెల్లించానని, మరి పేదల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తన కుమార్తె భౌతికకాయాన్ని ఒక ఆస్పత్రి నుంచి మరొక ఆసుపత్రికి తరలించడం కోసం అంబులెన్స్ డ్రైవర్ 3 వేల రూపాయలు డిమాండ్ చేశాడనీ అన్నారు. తర్వాత పోలీసు ఎఫ్‌ఐఆర్, పోస్టుమార్టం నివేదిక కాపీ కోసం నాలుగు రోజులు పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరిగినా పనికాలేదని, స్టేషన్‌లోనే పోలీసులు ఓపెన్‌గా లంచం డిమాండ్ చేయగా, తాను ఇచ్చినట్లు తన పోస్టులో రాసుకొచ్చారు. స్టేషన్‌లో వారు తనతో అసభ్యంగా కూడా మాట్లాడారని వాపోయారు. ఒక వ్యక్తి మానసికంగా కుంగిపోయి, తల్లడిల్లుతున్న సమయంలో పోలీసులు డబ్బులు డిమాండ్ చేయడం,నిర్లక్క్ష్యంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? వాళ్లకు కుటుంబం లేదా? వారికి బావోద్వేగాలు ఉండవా? అని వాపోయారు. ఇది అక్కడితో ఆగలేదనీ డెత్ సర్టిఫికెట్ కోసం బీబీఎంపీ కార్యాలయానికి వెళ్లగా.. కులసర్వే కారణంగా 5 రోజులు ఎవరూ అందుబాటులో లేరని , చివరికి బీబీఎంపీ సీనియర్ అధికారిని సంప్రదించిన తర్వాతే డెత్ సర్టిఫికెట్ ఇచ్చారనీ చెప్పారు. ఇందుకోసం ఆ అధికారి ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజు కంటే ఎక్కువ మొత్తంలో వసూలు చేశారని అన్నారు. చివర్లో.. ఈ అరాచకం నుంచి ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, అజీమ్ ప్రేమ్‌జీ వంటి సంపన్నులు కూడా బెంగళూరును రక్షించలేరని వాపోయాడు. వారు చాలా మాట్లాడతారు కానీ…అని పోస్ట్‌ను ముగించారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో బెంగళూరు పోలీస్ కమిషనర్ స్పందించారు. బెల్లందూర్ స్టేషన్ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసారు. పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి అనుచిత ప్రవర్తనను సహించదని పోస్ట్‌కు రిప్లై ఇచ్చారు. శివకుమార్ కుమార్తె 34 ఏళ్ల అక్షయ వర్క్‌ఫ్రమ్ హోమ్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో మెదడు రక్తస్రావం కారణంగా మరణించారు. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్, అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఆమె ఎంబీఏ పూర్తి చేశారు. ప్రముఖ పెట్టుబడుల సంస్థ గోల్డ్‌మన్ సాక్స్‌లో ఎనిమిదేళ్లు ఇతర సంస్థల్లో మూడేళ్లు పనిచేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కారులో మహిళ.. కళ్లు తెరిచేంతలోగా మృతి
వారం రోజులకు కనికరించిన దొంగ.. దోచుకున్న నగలు వాకిట్లో లభ్యం
పెళ్లింట విషాదం.. ముగ్గురుని మింగేసిన రోడ్డు ప్రమాదం
