Hanamkonda: ఆ ప్రాంతాన్ని ఇటీవల చుట్టుముట్టిన వరదలు.. తీవ్రత తగ్గగానే పొదల మధ్య కనిపించిన గణపయ్య
తవ్వకాల్లో పురాతన విగ్రహాలు.. నిధి నిక్షేపాలు బయటపడటం మనం గతంలో చూసి ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం ఊహించని సంఘటన జరిగింది. ఇటీవల హన్మకొండను చుట్టుముట్టిన వరదల కారణంగా ఓ అరుదైన పురాతన విగ్రహం బయల్పడింది. దీంతో స్థానికులు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. కాగా ఆ గణపతి దర్శించి.. ఆశీస్సులు తీసుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.
తెలంగాణ, ఆగస్టు 21: ఇటీవల వరంగల్, హన్మకొండ ప్రాంతాలను వరదలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. దీంతో స్థానికులు పడ్డ ఇబ్బందులు అన్నీ, ఇన్నీ కావు. ఎప్పుడూ లేనంతగా ఈ సారి వదర చుట్టుముట్టింది. ఈ క్రమంలోనే హన్మకొండ పరిమళ కాలనీలో అనూహ్య రీతిలో గణపతి విగ్రహం ప్రత్యక్షమైంది. వరదల ప్రభావంతో మట్టిలో నుంచి ఈ విగ్రహం బయటపడింది. దీంతో గ్రామస్థులు జేసీబీతో ఆ విగ్రహాన్ని పూర్తిగా బయటకు తీసి.. ఆ సమీప ప్రాంతంలో ప్రతిష్టించారు. దీంతో భారీగా తరలివచ్చి గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. కొబ్బరి కాయలు కొడుతూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. కాగా ఆ రాతి విగ్రహం.. కాకతీయుల కాలంనాటిదిగా గుర్తించారు. మూడు ఫీట్ల ఎత్తు, రెండున్నర ఫీట్ల వెడల్పుతో ఉన్న రాతి గణపతి విగ్రహం మట్టిలో నుండి బయటపడింది..ముళ్ళపొదల్లో ప్రత్యక్షమైన విగ్రహాన్ని చూసి స్థానికులు భక్తి భావంతో ఉప్పొంగి పోయారు.. ఆ విగ్రహానికి అక్కడికక్కడే గుడి కట్టేశారు.
నాలా పక్కన ఉన్న ముళ్లపొదలు మొత్తం తొలగించి గణపతి విగ్రహాన్ని వేద పండితుల సమక్షంలో అక్కడే ప్రతిష్టించారు.. కాలనీవాసులంతా అక్కడికి పెద్ద ఎత్తున తరలివచ్చి గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఐతే ఈ విగ్రహం ఎక్కడిది..? ఎక్కడి నుండి ఇక్కడినుండైనా కొట్టుకు వచ్చిందా..? లేక ఇక్కడే మట్టిలో కూరుకుపోయిన విగ్రహం బయటపడిందా..? అనే సందేహాలు కలుగుతున్నాయి.. ఆ విగ్రహం రూపును బట్టి ఇది కాకతీయుల కాలం నాటి విగ్రహంగా భావిస్తున్నారు.. ఇంతకాలం మట్టిలో కూరుకుపోయిన విగ్రహం ఇప్పుడు వరదల ప్రభావంతో బయటపడిందని భావిస్తున్నారు. త్వరలో గణపతి నవరాత్రి ఉత్సవాలు రాబోతున్న నేపథ్యం లో ఇక్కడ గణపతి విగ్రహం బయటపడడం శుభప్రదంగా బావిస్తున్నారు.. ఈ ప్రాంతమంతా ఒక్కసారిగా ఆధ్యాత్మిక భావన వుప్పొంగి పోయింది.. స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు నిర్వహిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.