గడ్డకట్టిన జలపాతంలో ఆటలు.. అంతలోనే షాకింగ్ ఘటన
కొంత మంది గడ్డ కట్టిన జలపాతం కింద నిలబడి ఉన్నారు. అయితే ఇంతలో అకస్మాత్తుగా వారిపై భారీ ఐస్ గడ్డ విరిగి పడింది. షాకింగ్‌కి గురి చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జనవరి 5 న చైనాలోని జియాన్, షాంగ్సీ, హిషాంచ జలపాతం దగ్గర ఈ ప్రమాదం జరిగింది.
ఘనీభవించిన జలపాతం కింద సరదాగా గడుపుతున్న పర్యాటకులపై అకస్మాత్తుగా టన్ను బరువున్న భారీ ఐస్ ఫలకం జారి పడింది. ఆనందంగా ఆడుకుంటున్న సమయంలో రెప్పపాటులో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా అరుపులు వినిపించాయి.తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పర్యాటకులు పరుగులు తీశారు. అయితే వారిలో ఒకరికి మంచు ఫలకం తగలడంతో గాయాలయ్యాయి. ఈ ప్రమాదం తర్వాత స్థానిక యంత్రాంగం ముందుజాగ్రత్త చర్యగా ఈ ప్రాంతంలో పర్యాటకుల రాకపోకలపై నిషేధం విధించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇలాంటి జలపాతాలు చాలా ప్రమాదకరమని కామెంట్ చేస్తున్నారు. ఇంతటి భయంకరమైన ప్రమాదంలో ఎవరికీ ఏమీ జరగనందుకు దేవునికి థాంక్స్ చెప్పాలని వేరొకరు కామెంట్ చేసారు. అయితే 6 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి ప్రమాదం జరిగింది. 2019లో చైనాలోని స్నో ఫాల్స్ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. అప్పుడు తొమ్మిది మంది గాయపడ్డారు