పగలు సెగలు..సాయంత్రం జల్లులు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వాతావరణం విచిత్రంగా మారుతోంది. ఒకవైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ 44 డిగ్రీల సెగలు కక్కుతుంటే, మరోవైపు ఆకస్మికంగా ఆకాశం మేఘావృతమై పిడుగులతో కూడిన వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎండకు వడదెబ్బ, వానకు పిడుగులు.. ఇలా జనం రెండు రకాల గండాల మధ్య సతమతమవుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వాతావరణం విచిత్రంగా మారుతోంది. ఒకవైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ 44 డిగ్రీల సెగలు కక్కుతుంటే, మరోవైపు ఆకస్మికంగా ఆకాశం మేఘావృతమై పిడుగులతో కూడిన వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎండకు వడదెబ్బ, వానకు పిడుగులు.. ఇలా జనం రెండు రకాల గండాల మధ్య సతమతమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే రెండ్రోజులు కూడా ఇదే వింత వాతావరణం కొనసాగనుందని వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎండలతో బాటు వడగాలుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. అదే సమయంలో కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండ్రోజులు కూడా రాష్ట్రంలో వాతావరణం ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇక.. గురువారం రాష్ట్రంలోని 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 21 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, రామభద్రాపురం, పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు, సీతానగరం, అల్లూరి జిల్లా అనంతగిరి వంటి 10 మండలాల్లో ఎండలు పెరుగుతాయని నిపుణులు హెచ్చరించారు. ఒకవైపు భానుడి భగభగలతో ప్రజలు అల్లాడుతుంటే, మరోవైపు ద్రోణి ప్రభావంతో అకాల వర్షాలు మరియు పిడుగులు పడే ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. శుక్రవారం రేపు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తరాంధ్ర, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లోనూ పిడుగులు పడే ప్రమాదముందని హెచ్చరించింది. మరోవైపు, బుధవారం 16 జిల్లాల్లోని 88 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో అత్యధికంగా 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 43.4 డిగ్రీలు, పల్నాడు జిల్లా బెల్లంకొండలో 43.3 డిగ్రీలు, మార్కాపురం జిల్లా నందనమారెళ్ళలో 43.2 డిగ్రీలు, చిత్తూరు జిల్లా గంగవరంలో 42.8 డిగ్రీలు, కర్నూలు జిల్లా నగరడోనలో 42.7 డిగ్రీలు, తిరుపతి జిల్లా దొరవారిసత్రంలో 42.5 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 42.4 డిగ్రీలు, పార్వతీపురం మన్యం జిల్లా మక్కువతో పాటుగా పోలవరం జిల్లా విఆర్ పురంలో 42.2 డిగ్రీలు, నంద్యాల జిల్లా చాగలమర్రితో పాటుగా ప్రకాశం జిల్లా కొప్పెరపాడు, కడప జిల్లా కడప లింగాలలో 42.1 డిగ్రీలు, అనంతపురం జిల్లా రాయదుర్గంలో 42 గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు తెలంగాణలోనూ ఎండలు మునుపెన్నడూ లేని విధంగా ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 11 దాటితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండల తీవ్రతకు జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. సిద్దిపేట, ఆదిలాబాద్, జగిత్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాల్లోనూ ఎండ తీవ్రత ప్రజలను అతలాకుతలం చేసింది. ఒకవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు ఊహించని వర్షాలు అన్నదాతలను హడలెత్తిస్తున్నాయి. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కోతకు వచ్చిన మామిడి, మిర్చి పంటలు దెబ్బ తింటున్నాయి. మరోవైపు కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిముద్దవుతుంది. ఎండా కాలంలో కురిసే అకాల వర్షాల కారణంగా రైతులు దారుణంగా దెబ్బ తింటున్నారు. మండుతున్న ఎండలకు తోడు పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశాలున్నాయి. గురువారం వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆసిఫాబాద్, మెదక్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం వల్ల గాలిలో ఏర్పడిన మార్పుల కారణంగా అకస్మాత్తుగా ఉరుములతో కూడిన జల్లులు పడుతున్నాయి. సాయంత్రం వేళకు రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో కూడా ఆకాశం మేఘావృతమై వర్షం పడే వీలుంది. శుక్ర, శనివారాల్లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో బుధవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్‌లో అత్యధికంగా 46 డిగ్రీల గరిష్టానికి చేరుకున్నాయి. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కొరటపల్లిలో 45.9, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరాలో, జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్‌లో 45.8, ఆదిలాబాద్ జిల్లా సత్నాలాలో 45.6, కామారెడ్డి జిల్లా బాన్స్‌వాడలో 45.5, సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపేటలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు మధ్యాహ్నం బయటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు అధికారులు. ప్రతి ఒక్కరూ తగినంత నీరు తాగాలని.. వృద్ధులు, చిన్నపిల్లలు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిచంచారు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు. టోపీ, కర్చీఫ్ కట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తున్నప్పుడు రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని హెచ్చరించింది. అదేవిధంగా, ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికాకు ‘గుండెపోటు’ తప్పదు.. ఇరాన్ మాస్ వార్నింగ్!
దేశంలో వద్దనుకున్న వాటిని.. విదేశాల్లో డాలర్లు పెట్టి కొంటున్నాం.. ఆస్ట్రేలియాలోని భారతీయ మహిళ వైరల్
స్మార్ట్‌ఫోన్‌లకు చెక్ పెడుతున్న ‘టిన్ క్యాన్’
Rama Prabha: హీరో ఛాన్స్ ఇప్పిస్తే వదిలేశాడు.. అతడికి చాలా బలుపు
కావిడి కట్టి.. తల్లిని మోసి.. 3 నెలలు 24 రోజుల పాటు 1,800 కి.మీ నడిచి