Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో ఆ జిల్లాల్లో పిడుగులు.. తెలంగాణలో వచ్చే 5 రోజులూ వానలే
వర్షాల కోసం ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రాబోయే రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచనున్నాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లోనూ వాతావరణం చల్లబడనుంది. మరోవైపు వర్షాలు, విద్యుత్ కోతలతో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
వర్షాలు లేక అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడనుందని, దీని ప్రభావంతో రాగల 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గురువారం నుంచే పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని ఐఎండీ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం వల్ల రెండు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడనుంది. వర్ష సూచనతో ఉక్కపోత నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించనుంది. ఏపీలో గురువారం అక్కడక్కడ వానలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మేఘావృత వాతావరణంతో పాటు బలమైన ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కాకినాడ, తూర్పుగోదావరి, తిరుపతి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే సూచనలు ఉన్నాయి. తిరుపతి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడవచ్చు. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అందువల్ల మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎగువ ప్రాంతాల్లో వానలు లేకపోవడంతో శ్రీశైలం జలాశయానికి వరద బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 5,588 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 35,315 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 866.30 అడుగులకు చేరింది. నీటి కొరత కారణంతో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో మాత్రం విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోంది. కర్నూలు నగరంలో వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ వినాయక ఘాట్ వద్ద పర్జన్య సహిత మహా వరుణ యాగం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు సమర్పించారు. ఇదిలాఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 5 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచేలా వాతావరణం ఉంటుందని హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు గణనీయంగా నమోదవుతున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడి పోతున్నారు. తెలంగాణలో గత వారం రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. సూర్యాపేటలో అత్యధికంగా 38 డిగ్రీలు నమోదు కాగా, ఖమ్మం, నల్గొండ, వరంగల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 37 డిగ్రీల మార్కును దాటేసింది. గాలిలో తేమ 100 శాతానికి చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్ నగరంతో పాటు దాని పరిసర ప్రాంతాలైన రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరిలలో గురువారం వాతావరణం కూల్ కానుంది. ఆకాశం రోజంతా పాక్షికంగా లేదా పూర్తిగా మేఘావృతమై ఉంటుందని, సాయంత్రానికి పలు డివిజన్లలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 28°C నుంచి 30°C మధ్య, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22°C నుంచి 24°C వరకు నమోదవుతాయని అంచనా వేసింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 7,400 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 9,265 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 318.39 మీటర్ల వద్ద నీటిమట్టం ఉంది. ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలోని ఒక యూనిట్‌లో ప్రస్తుతం 39 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ వద్ద ఖమ్మం-కోదాడ జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. కొత్తగూడెం మేజర్ కాలువకు తక్షణమే నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాలువల్లో నీరు రాక, విద్యుత్ కోతల వల్ల సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగూడెం మేజర్‌కు నీటిని విడుదల చేసి చెరువులను నింపాలని, తమ పంటలను కాపాడాలని రైతులు అధికారులను కోరారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో రైతు సంఘం ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక బోర్లపైనే ఆధారపడి పంటలు సాగు చేశామని, విద్యుత్ అంతరాయం వల్ల పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. పాలేరు నియోజకవర్గంలోనే కరెంట్ కోతలు ఉన్నాయని ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అధికారులు తక్షణమే స్పందించి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామపంచాయతీ పరిధిలో వ్యవసాయ విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి రోజురోజుకూ కోతలు పెంచుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అధికారుల హామీతో రెండు గంటల పాటు స్తంభించిన రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఏకిన్ పూర్ గ్రామంలో కరెంట్ కోతలకు వ్యతిరేకంగా రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వర్షాలు లేక ఇబ్బందులు పడుతుంటే కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు తమ ధర్నాను విరమించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక.. మెట్రో, ఆర్టీసీ ప్రయాణం మరింత సులభం!
