డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ఇక దశ తిరిగినట్లే
తెలంగాణలో గ్రామీణ మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి పథకాన్ని విస్తృతంగా అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం ఉపాధి కల్పనకే పరిమితం కాకుండా.. మహిళలను నిజమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతోంది. పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా రుణాలు అందించడంతోపాటు.. మహిళల కోసం క్యాంటీన్లు, డెయిరీ పార్లర్లు, సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకుల నిర్వహణ వంటి విభిన్న అవకాశాలను కల్పిస్తోంది.
ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించి.. వాటి ద్వారా ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయించే ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడం ద్వారా మహిళలకు ఒక స్థిరమైన ఆదాయ మార్గం ఏర్పడుతుంది. ఫలితంగా బస్సుల కొరత సమస్య కూడా కొంత మేరకు పరిష్కారమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం రూ.30 లక్షల ఆర్థిక సహాయం అందిస్తే.. మహిళా సంఘాలు రూ.6 లక్షలు జోడించి బస్సు కొనుగోలు చేసే అవకాశం కలుగుతుంది. ఈ బస్సుల ద్వారా నెలకు మహిళా సంఘాలకు నికర ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విధానం ద్వారా మహిళలు ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుంది. తెలంగాణలో అమలు అవుతున్న మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. దీంతో వీరికి పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తుండగా.. వీటిలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీనివల్ల ఆర్టీసీకి అదనపు వాహనాలు అవసరం ఏర్పడింది. కొత్తగా బస్సులను కొనుగోలు చేయడం ఆర్థిక భారంగా మారడంతో.. మహిళా సంఘాల అద్దె బస్సులను వినియోగించడం రెండు వర్గాలకూ లాభదాయకంగా మారుతుందని భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
