మందుబాబులకు షాక్.. జూన్ 2 తర్వాత వీర బాదుడే!
తెలంగాణలో మద్యం, బీర్ల ధరలు త్వరలో 10 నుంచి 15 శాతం వరకు పెరగనున్నట్లు సమాచారం. ముడిసరుకుల ధరలు, తయారీ వ్యయం పెరగడంతో కంపెనీలు ఒత్తిడి తెస్తుండగా, రాష్ట్ర ఖజానాకు అదనపు ఆదాయం సమకూర్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయంపై కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. జూన్ 2 తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.
తెలంగాణలో మద్యం ప్రియులకు తెలంగాణ సర్కార్ బిగ్ షాకివ్వబోతోంది. రాష్ట్రంలో త్వరలోనే అన్ని రకాల మద్యం, బీర్ల ధరలను 10 నుంచి 15 శాతం వరకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం ముగిసిన తర్వాత ఈ ధరల పెంపుపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా తెలుస్తోంది. గత కొంతకాలంగా ముడిసరుకుల ధరలు, ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడంతో సీసాల తయారీ వ్యయం 15 నుంచి 20 శాతం వరకు పెరిగింది. ఈ నేపథ్యంలో ధరలను పెంచాలంటూ మద్యం తయారీ కంపెనీల నుంచి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. ఈ సమస్యపై అధ్యయనం చేసిన ప్రభుత్వ త్రిసభ్య కమిటీ, పొరుగు రాష్ట్రాల ధరలను పరిశీలించి తెలంగాణలో 25 నుంచి 30 శాతం వరకు ధరలు పెంచవచ్చని సిఫార్సు చేసింది. అయితే, ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ప్రభుత్వం 10 నుంచి 15 శాతం మేరకే పెంచాలని యోచిస్తోంది. ఈ పెంపు అమలైతే సాధారణ బ్రాండ్లతో పాటు ప్రీమియం బ్రాండ్లు, బీర్ల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక, అబ్కారీ శాఖలు దీనికి సంబంధించిన కసరత్తును ఇప్పటికే పూర్తి చేశాయి. ప్రభుత్వానికి అదనపు ఆదాయం లభించనున్నప్పటికీ, మద్యం ప్రియులకు మాత్రం ఇది పెనుభారంగా మారే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంతరిక్ష అద్భుతాన్ని మన గ్రామస్తుడు ఫొటో తీసాడు!
పూట గడవడానికి అప్పులు! అమెరికన్ల కష్టాలపై సర్వే!
ఏటీఎం నుంచే పీఎఫ్ డబ్బులు.. కొత్త రూల్ చూశారా?