అద్భుతాన్ని కనిపెట్టి.. సీక్రెట్‌ మెయిన్‌టైన్ చేసిన ఇస్రో!

Updated on: May 25, 2026 | 4:30 PM

చంద్రయాన్-3 మిషన్ ముగిసినా విక్రమ్ ల్యాండర్ చేసిన ప్రయోగాలు ఇప్పటికీ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్నాయి. చంద్రుడి ఉపరితలం కింద ఉన్న మట్టి పొరల నిర్మాణంపై ఇస్రో కీలక వివరాలు వెల్లడించింది. ల్యాండర్ ఇంజిన్ల ప్రభావంతో పైపొర తొలగిపోవడంతో లోతైన మట్టిని పరిశీలించే అవకాశం దొరికింది. ఈ అధ్యయనం భవిష్యత్ నాసా ఆర్టెమిస్ మిషన్లకు కూడా ఎంతో ఉపయోగపడనుంది.

భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ ముగిసింది. ఇప్పటికీ ఆ మిషన్‌ సరికొత్త అద్భుతాలను బయటపెడుతూనే ఉంది. ‘శివశక్తి పాయింట్’ వద్ద విక్రమ్ ల్యాండర్ చేసిన ఒక చిన్న ప్రయోగం ఇప్పుడు శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. అంతర్జాతీయ అంతరిక్ష సంస్థ నాసా సైతం షాకయ్యే విషయాలు ఇస్రో ద్వారా వెలుగులోకి వచ్చాయి చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ తన ప్రయోగాలు పూర్తి చేసుకునే సమయానికి దానిలో కొంత ఇంధనం మిగిలింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు ముందుగా ప్లాన్ చేయని ఒక సాహసం చేశారు. ఇంజిన్లను మళ్లీ మండించి విక్రమ్‌ను చంద్రుడి ఉపరితలం నుంచి 50 సెంటీమీటర్ల పైకి లేపి పక్కకు కాస్త దూరంలో ల్యాండ్ అయ్యేలా చేశారు. టెక్నాలజీ పరంగా అది భారత్‌కు ఒక పెద్ద విజయమైనా సైంటిఫిక్‌గా అంతకంటే పెద్ద రహస్యం దీనివల్ల బయటపడింది. ల్యాండర్ ఇంజిన్లు మళ్లీ మండటంతో ఆ మంటల ధాటికి చంద్రుడిపై ఉన్న 3 సెంటీమీటర్ల పైపొర గాల్లోకి లేచింది. పైకి మెత్తగా, దూదిలా ఉండే పొడి మట్టి కొట్టుకుపోవడంతో.. దాని కింద ఎప్పుడూ ఎండ తగలని సరికొత్త మట్టి పొరలు ల్యాండర్‌లోని చాస్టే పరికరానికి చిక్కాయి. ఇలా ఎలాంటి డ్రిల్లింగ్ మిషన్ లేకుండానే చంద్రుడి అంతర్భాగంలో ఉన్న మట్టిని పరిశీలించే అరుదైన అవకాశం శాస్త్రవేత్తలకు దొరికింది. ఈ ప్రయోగం ద్వారా వచ్చిన డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. చంద్రుడి ఉపరితలం ‘కేక్’లా పొరలు పొరలుగా ఉందని తేల్చారు. పైన ఉండే మట్టి ఎంతో వదులుగా, పొడి పిండిలా ఉంటే.. కేవలం 6 సెంటీమీటర్ల లోతులోనే అది తడి జిగురు మట్టిలా చాలా గట్టిగా మారింది. అంటే తక్కువ దూరంలోనే నేల స్వభావం పూర్తిగా మారిపోతోందని స్పష్టమైంది. ఈ రకమైన వైవిధ్యం గతంలో అమెరికా అపోలో మిషన్లు వెళ్లిన చంద్రుడి భూమధ్యరేఖ ప్రాంతంలో ఎక్కడా కనిపించలేదు. నాసాకు ఈ విషయం ఎలా ఉపయోగపడుతుంది అంటే.. నాసా తన ప్రతిష్ఠాత్మక ‘ఆర్టెమిస్’ మిషన్ ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై మనుషులను దించి అక్కడ శాశ్వత స్థావరాలను నిర్మించాలని చూస్తోంది. చందమామ ఇలా మారుతుందని ఇస్రో కనిపెట్టడం వల్ల.. అక్కడ భవిష్యత్తులో ఇళ్లు కట్టాలన్నా, దిగాలన్నా ఆ పొరల స్వభావం తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. పైగా ఈ పొరలే చంద్రుడి లోపల ఉన్న మంచు గడ్డకట్టేలా కాపాడుతున్నాయని తెలియడంతో భవిష్యత్ మిషన్లకు ఇదొక గైడ్‌లా మారబోతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాలానికి తగ్గట్టు రంగు మార్చే పక్షిని చూశారా

Follow Us