అమ్మాయిలూ.. మీరు అదుర్స్.. వరుసగా రెండోసారీ కబడ్డీ వరల్డ్ కప్

Updated on: Nov 27, 2025 | 6:15 PM

భారత మహిళల కబడ్డీ జట్టు ఢాకాలో జరిగిన 2025 ప్రపంచకప్‌ను వరుసగా రెండోసారి గెలిచి చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో చైనీస్ తైపీని 35-28తో ఓడించి, టోర్నమెంట్ మొత్తంలో అజేయంగా నిలిచింది. ఈ చారిత్రక విజయం దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందింది, ప్రధానమంత్రి మోదీ కూడా అభినందించారు. ఈ గెలుపు యువ క్రీడాకారిణులకు స్ఫూర్తినిస్తుంది.

భారత మహిళా కబడ్డీ జట్టు మరోసారి సత్తా చాటింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన మహిళల కబడ్డీ వరల్డ్ కప్ 2025 ఫైనల్‌లో మన ఆడబిడ్డలు అదుర్స్‌ అనిపించారు. ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 35-28 తేడాతో బలమైన చైనీస్ తైపీని ఓడించి, వరుసగా రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 11 దేశాలు పాల్గొనగా, భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా కప్‌ను గెలుచుకుంది. ఈ విజయం భారత కబడ్డీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది. ఉత్కంఠగా సాగిన ఫైనల్‌ పోరులో చైనీస్ తైపీ జట్టు భారత మహిళా జట్టుకు గట్టి పోటీ ఇచ్చింది. అయితే భారత కెప్టెన్ రీతు నేగి, వైస్ కెప్టెన్ పుష్పా రాణా అద్భుతమైన నాయకత్వ పటిమ కనబరిచారు. ముఖ్యంగా సంజూ దేవి చేసిన సూపర్ రైడ్ జట్టుకు కీలక మలుపునిచ్చి, మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. ఈ ప్రదర్శనతో భారత్ విజయాన్ని సులభతరం చేసుకుంది. భారత జట్టు కేవలం ఫైనల్‌లోనే కాదు, టోర్నమెంట్ అంతటా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గ్రూప్ స్టేజ్‌లో థాయ్‌లాండ్‌ను 68-17 తేడాతో, నేపాల్‌ను 50-12 తేడాతో ఓడించింది. సెమీ-ఫైనల్‌లో బలమైన ఇరాన్ జట్టును 33-21 తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. భారత మహిళల జట్టు సాధించిన ఈ చారిత్రక విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా జట్టును అభినందించారు. “కబడ్డీ వరల్డ్ కప్ 2025 గెలిచి దేశ గౌరవాన్ని పెంచిన మా మహిళల కబడ్డీ జట్టుకు అభినందనలు. ఈ విజయం ఎంతో మంది యువతకు కబడ్డీలో ముందుకు వెళ్లడానికి, పెద్ద కలలు కనడానికి స్ఫూర్తినిస్తుంది” అని ప్రధాని ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీ యాటిట్యూడ్‌ను మీ జేబులోనే పెట్టుకోండి.. క్యాబ్ డ్రైవర్ రూల్స్ వైరల్

ఆరు శతాబ్దాల మహావృక్షం చరిత్ర.. ఇది ఒక ఆధ్యాత్మిక అద్భుతం

ఫోన్‌‌లో మాటలు విన్నాడు.. మనసు గెలిచాడు

తిరుపతి మీదుగా దూసుకెళ్లనున్న బుల్లెట్ రైలు.. హైదరాబాద్ నుంచి రెండు గంటల్లోనే చెన్నైకి

Andhra Pradesh: ఏపీలో స్మార్ట్‌ కార్డ్‌.. ఆధార్‌ను మించి..