‘సండే ఆన్ సైకిల్’.. పోలీసుల వినూత్న ఆలోచన!
ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మేదరమెట్లలో ‘ఫిట్ ఇండియా సైక్లింగ్ డ్రైవ్’ కార్యక్రమం నిర్వహించారు. సీఐ మల్లికార్జునరావు, ఎస్సై వినోద్ బాబు సిబ్బందితో కలిసి సైక్లింగ్ చేస్తూ ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. సైక్లింగ్ ఆరోగ్యానికి, పర్యావరణ పరిరక్షణకు, ఇంధన పొదుపుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
“ఆరోగ్యమే మహాభాగ్యం.. అందుకు ఉత్తమ మార్గం సైక్లింగ్ ” అనే నినాదంతో ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ సరికొత్త అడుగులు వేస్తోంది. నిరంతరం శాంతిభద్రతల రక్షణలో బిజీగా ఉంటూ, మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే పోలీస్ సిబ్బంది.. శారీరక దృఢత్వం, మెరుగైన ఆరోగ్యం కోసం ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సెలవు రోజైన ఆదివారం నాడు విధులకు కాస్త విరామం ఇచ్చి, ‘సండే ఆన్ సైకిల్’ అంటూ రోడ్లపైకి వచ్చి ప్రజల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్లలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘ఫిట్ ఇండియా సైక్లింగ్ డ్రైవ్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వినూత్న ర్యాలీలో మేదరమెట్ల సీఐ మల్లికార్జునరావు, ఎస్సై వినోద్ బాబు స్వయంగా పాల్గొని, సిబ్బందితో కలిసి కిలోమీటర్ల మేర సైకిళ్ళు తొక్కుతూ అందరినీ ఆకట్టుకున్నారు. ఇకపై ప్రతి ఆదివారం ఈ సైక్లింగ్ డ్రైవ్‌ను కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఐ మల్లికార్జునరావు మాట్లాడుతూ.. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో శారీరక దృఢత్వానికి సైక్లింగ్ ఎంతో మేలు చేస్తుందన్నారు. దీనివల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండటమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు కూడా సాధ్యమవుతుందని చెప్పారు. కేవలం పోలీసులే కాకుండా, ప్రతి ఒక్కరూ సైక్లింగ్‌ను తమ దైనందిన జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కన్నతల్లి మరణం తట్టుకోలేక..కుప్పకూలిన కుమార్తె!
కస్టమర్లను ముంచేసిన గోల్డ్ అప్రైజర్.. రూ.40 లక్షల బంగారంతో పరార్
చెరువుపై పడ్డ ఊరు.. మొత్తం ఊడ్చేశారుగా
‘అణు చెత్త’ను తొలిసారిగా సమాధి చేస్తున్న ఫిన్లాండ్
కిటికీలు, అద్దాలతో పవర్ ప్రొడక్షన్.. ఈ టెక్నాలజీ వస్తే.. అందరికీ జీరో బిల్లులే
