స్కూటర్‌పై మళ్లీ పాలు అమ్మిన మల్లారెడ్డి..సోషల్‌ మీడియాలో వైరల్‌

Updated on: Feb 21, 2025 | 2:52 PM

నా కష్టాల గురించి ఏం చెప్పమంటారు అధ్యక్షా.. పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. సక్సెస్‌ అయినా.. ఈ డైలాగ్స్‌ వింటుంటే ఎవరో గుర్తొస్తున్నారు కదూ.. యస్‌.. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఊత పదాలు ఇవి. ఆయన పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే డైలాగ్స్‌ ఇవే. తన వేరియషన్‌లో మల్లారెడ్డి చెప్పిన ఈ డైలాగ్‌ చాలా పాపులర్‌ అయ్యింది.. ఇప్పుడెందుకు ఆయన డైలాగ్స్‌ గుర్తు చేస్తున్నారు అనే కదా మీ డౌటనుమానం.. వ్యాపారస్తుడిగా కోట్లక పడగలెత్తినా.. రాజకీయ నేతగా పార్లమెంటు స్థాయికి వెళ్లినా ఆయన తాను ఎక్కొచ్చిన ఒక్కో మెట్టును మాత్రి మర్చిపోలేదని నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియో చూస్తే మీరు కూడా ఒప్పుకుంటారు.

డైలాగ్‌ వరకే కాదు.. నిజంగానే ఆయన పాలు అమ్ముకునే స్థాయి నుంచి వ్యాపారవేత్తగా, రాజకీయవేత్తగా ఎదిగారు.. అలాంటి మల్లారెడ్డి ఇప్పుడు మరోసారి స్కూటర్‌పై ఎక్కి పాలు అమ్ముతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.మేడ్చల్‌ జిల్లా బోడుప్పల్‌లో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ పాల డబ్బాలతో కనిపించిన ఓ స్కూటర్‌ను చూడగానే మల్లారెడ్డి తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. దీంతో వెంటనే వెళ్లి ఆ స్కూటర్‌ ఎక్కేశారు. గతంలో పాలు అమ్ముతూ కష్టపడిన రోజులను నెమరేసుకున్నారు. అనంతరం ఎంతో ఆనందంతో స్కూటర్‌ పై నుంచి దిగి ఆ పాల బండి ఓనర్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చారు. అనంతరం శాలువా కప్పి సన్మానించారు. ఇదంతా అక్కడే ఉన్న కొంతమంది వీడియో తీసి నెట్టింట పోస్టు చేశారు. ఈ వీడియో కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది.