Big News Big Debate: ఏపీలో శాంతిభద్రతలు అదుపుతప్పాయా? ప్రతిపక్షాల ఆరోపణలకు సర్కార్ కౌంటర్..?

|

Jun 16, 2023 | 7:01 PM

ఏపీలో శాంతిభద్రతలు అదుపుతప్పాయా? విశాఖలో అసాంఘీక శక్తులు రాజ్యమేలుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆరోపించిన 24 గంటల్లోనే విశాఖపట్నంలో ఎంపీ కుటుంబం కిడ్పాప్‌కు గురికావడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. దీంతో ఏపీ నేరాలకు అడ్డాగా మారిందని బలంగా ఆరోపిస్తున్నాయి విపక్షాలు. అయితే ఒకటి రెండు ఘటనలతో పోలీస్‌వ్యవస్థ నిర్విర్యం అయిందనడం సరికాదంటున్నారు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి.

విశాఖపట్నంలో ఇటీవల పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విశాఖలో అసాంఘీక శక్తులు రాజ్యమేలుతున్నాయని.. గట్టిగానే ఫైరయ్యారు.  సరిగ్గా ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజుల్లోనే విశాఖపట్నంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ సంచలనంగా రేపింది. రాష్ట్రంలో శాంతిభద్రతలపై విశాఖలో అమిత్‌షా మాట్లాడితే అందరూ గగ్గోలు పెట్టారని, ఇప్పుడు అదే నిజమైందని సెటైర్ వేశారు బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి. ఎంపీ కుటుంబానికే భరోసా లేనప్పుడు సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు మాజీ సీఎం. ఇలాంటి ఘటనల్లో ఎలా స్పందించామన్నది ముఖ్యం అంటున్నారు విశాఖపట్నం సీపీ. ఒకటి రెండు ఘటనలు దృష్టిలో పెట్టుకుని మొత్తం రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని.. పోలీస్‌ వ్యవస్థ నిర్విర్యం అయిందని ఆరోపించడం ఏంటని ప్రశ్నించారు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి. రాష్ట్రంలో క్రైమ్ రేట్ బాగా తగ్గిందన్నారు డీజీపీ. గంజాయి సాగు, రవాణాను గతంలో ఎప్పుడూ లేనంతగా అరికట్టామంటున్నారు.