తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్ 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు, పిడుగులు

Updated on: Jun 27, 2026 | 5:45 PM

ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ కాగా, ఉరుములు, మెరుపులు, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉత్తరాంధ్ర, కోనసీమ, కాకినాడ, విశాఖ సహా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో ద్రోణి ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు, వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్రానికి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవచ్చని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ హెచ్చరికలతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ద్రోణి ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మారిపోతోంది. రాబోయే కొన్ని గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆకాశం పూర్తిగా మేఘావృతమై వర్షాలు పడతాయి. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. అటు ప్రకాశం జిల్లాతో పాటు మార్కాపురం పరిసర ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. నెల్లూరు జిల్లాలో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాల సమయంలో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వర్షం పడే సమయంలో పొరపాటున కూడా ఎవరూ చెట్ల కింద ఉండకూడదు. పట్టణాల్లో రోడ్ల పక్కన ఉండే భారీ హోర్డింగ్స్, ఫ్లెక్సీల దగ్గర అసలు నిలబడొద్దు. కృష్ణా జిల్లా గుడివాడ పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజామున 3 గంటల నుండి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం స్టార్టయింది. శుక్రవారం వరకు తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలకు ఈ వర్షం బాగా రిలీఫ్ ఇచ్చింది. ఉదయాన్నే కురుస్తున్న వర్షం కారణంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వర్షాలు లేక వరి నాట్లు వేయడానికి, నారు మళ్లకు నీరు అందక తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులకు ఇది ఎంతో ఊరటనిచ్చింది. విశాఖపట్నంలో శనివారం నాడు వాతావరణం చల్లగా మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురుస్తోంది. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో అల్లాడిన విశాఖ ప్రజలకు ఈ వర్షంతో వాతావరణం చల్లబడి ఉపశమనం లభించింది. అనకాపల్లి పట్టణంతో పాటు కశింకోట, ఇంకా అనకాపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో ఉరుములతో భారీ వర్షం కురిసింది. సుమారు గంట పాటు కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాల రహదారులు జలమయమయ్యాయి. గత రెండు రోజుల నుంచి సాయంత్రం పూట ఆకాశం మేఘావృతం అవుతున్నప్పటికీ వర్షం కురవలేదు. ఎండ తీవ్రత, ఉక్కపోతతో ఇబ్బంది పడిన జనం.. వర్షంతో కాస్త కుదుటపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాల సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాబోయే ఏడు రోజుల పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడవచ్చు. ఈ నెల 27 నుంచి జూలై 2వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. పలు జిల్లాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. అదే సమయంలో ఉరుములతో కూడిన జల్లులు పడే వీలుంది. ఈ అకాల వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే ప్రయాణాలు చేసే వారు అలెర్ట్ గా ఉండాలి. ప్రజలందరూ వాతావరణ శాఖ అందించే తాజా సమాచారాన్ని గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడతాయి, మరి కొన్ని జిల్లాల్లో ఉరుములు కూడిన వర్షం ఉండవచ్చు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తూ, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఈ ఆకస్మిక వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా వాహనదారులు ఉరుములు, మెరుపుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rashmika Mandanna: ట్రోలింగ్ భయంతో.. నోరు విప్పలేకపోతున్నా.. రష్మిక ఎమోషనల్

రూ.20 కడితే.. రూ.2 లక్షల బీమా.. అయినా ఎందుకింత నిర్లక్ష్యం?

ఖర్జూరం ప్రియులు తస్మాత్ జాగ్రత్త! గడువు ముగిస్తే.. ముప్పు తప్పదు!

అధిక బరువుతో గుండె జబ్బులే కాదు.. 19 రకాల క్యాన్సర్ల ముప్పు!

కీర దోసకాయ వీరికి విషంతో సమానం!

Published on: Jun 27, 2026 05:44 PM
Follow Us