AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కీర దోసకాయ వీరికి విషంతో సమానం!

కీర దోసకాయ వీరికి విషంతో సమానం!

Phani CH
|

Updated on: Jun 27, 2026 | 5:16 PM

Share

బరువు తగ్గడం, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో కీరదోసకాయ ఉపయోగకరమైనప్పటికీ, అది అందరికీ ఒకేలా సరిపోదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరిలో గ్యాస్, అజీర్ణం, అలర్జీ, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. చేదుగా ఉన్న కీరదోసను తినకూడదని, శుభ్రంగా కడిగి పరిమిత మోతాదులోనే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

బరువు తగ్గాలన్నా.. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందాలనుకునేవారు మొదటగా ఎంచుకునేది కీరదోసకాయ. సలాడ్స్ రూపంలో క్యారట్, బీట్‌రూట్‌లతో పాటు దీనిని పచ్చిగా తినేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఇందులో ఫైబర్ , నీటి శాతం పుష్కలంగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలిగిస్తుంది. తద్వారా పదే పదే ఆహారం తినాలనే కోరిక తగ్గి, క్యాలరీల వినియోగం అదుపులోకి వచ్చి బరువు తగ్గుతారు. అయితే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని భావించే కీరదోసకాయ అందరికీ ఒకేలా సరిపోదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరి శరీర తత్వానికి ఇది పడకపోగా, మరికొందరిలో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కీరదోసకాయలో ఉండే పీచు పదార్థాలు, కొన్ని సహజ రసాయనాలు అందరి జీర్ణవ్యవస్థకూ పడవు. ముఖ్యంగా సున్నితమైన జీర్ణకోశం ఉన్నవారు దీనిని ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే కడుపు ఉబ్బరం , గ్యాస్, కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి. కొన్నిసార్లు దోసకాయ తింటున్నప్పుడు విపరీతమైన చేదు రుచి తెలుస్తుంది. దీనికి అందులో ఉండే ‘కుకుర్బిటాసిన్స్’ అనే సహజ రసాయనాలే కారణం. స్వల్ప మోతాదులో ఇవి పెద్దగా నష్టం చేయకపోయినా.. మరీ చేదుగా ఉన్న కీరదోసను తింటే మాత్రం వికారం, వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పి, విరేచనాల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే చేదుగా అనిపిస్తే వెంటనే దానిని పక్కన పారేయడం ఉత్తమం. మిగతా పచ్చి కూరగాయల తరహాలోనే కీరదోసకాయల పైన కూడా హానికర బ్యాక్టీరియా చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ నుండి తెచ్చిన వెంటనే సరిగా కడగకుండా లేదా అపరిశుభ్రమైన ప్రదేశాల్లో నిల్వ చేసి తింటే ఫుడ్ పాయిజనింగ్‌కు గురవుతారు. దీనివల్ల జ్వరం, విరేచనాలు, వాంతులు, కడుపులో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా అరుదుగా కొందరిలో కీరదోసకాయ తిన్నప్పుడు అలర్జీ లక్షణాలు బయటపడతాయి. నోరు, గొంతులో దురద రావడం, పెదవులు లేదా నాలుక వాపు రావడం, చర్మంపై దద్దుర్లు, గొంతు మంట వంటి ఇబ్బందులు ఎదురైతే కీరదోస తినడం ఆపేసి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కీరదోసలో దాదాపు 95% నీరే ఉంటుంది. అందువల్ల దీనిని మోతాదుకు మించి తింటే సాధారణం కంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. కిడ్నీ సమస్యలు లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకునే ముందు వైద్యుల సూచనలు పాటించడం మంచిది. కీరదోసకాయను తినే ముందు ఉప్పు నీటితో లేదా మంచి నీటితో బాగా కడిగి, శుభ్రం చేసుకోవాలి. జీర్ణకోశ సమస్యలు, గ్యాస్ ఇబ్బందులు ఉన్నవారు కీరదోసకాయను తొక్క తీసి తింటే సులభంగా జీర్ణమవుతుంది. అమృతమైనా మితంగానే ఉండాలి. సలాడ్స్ రూపంలో తీసుకున్నప్పుడు రోజుకు ఒకటి లేదా అర ముక్క మాత్రమే తీసుకోవడం మంచిది. కీరదోసకాయలను ఎప్పుడూ శుభ్రమైన, చల్లని ప్రదేశంలో లేదా ఫ్రిజ్‌లో భద్రపరచాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైద్య ప్రపంచంలో అద్భుతం.. మ్యాజిక్ మష్రూమ్స్’తో మతిమరుపు మాయం

చాక్లెట్‌ తినాలనిపిస్తోందా? మీ శరీరం ఏం చెబుతుందో తెలుసా!

Follow Us