ఆ గ్రామంలో ఒకే ఒక్కడు..వీడియో
ఊరు అంటే.. కనీసం ఒక 50 మంది జనాభా అయినా ఉంటారు. కానీ, తమిళనాడులోని శివగంగై జిల్లా నాట్టాకుడి అనే గ్రామంలో ఒకే ఒక వృద్ధుడు.. బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. గతంలో ఇక్కడ 50 కుటుంబాలుండేవి. ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా.. అక్కడి జనం అలాగే బతుకు సాగించారు. చివరికి తాగునీరు కోసం, బడి, వైద్యం కోసం పక్క గ్రామం మీద ఆధారపడుతూనే దశాబ్దాలు గడిపేశారు. కానీ, కాలంతో బాటు వచ్చిన మార్పులతో, కొత్త తరమంతా ఉపాధి కోసం నగరాలకు పోవటంతో.. ఈ గ్రామంలో ఆ వృద్ధుడొక్కడే మిగిలాడు.
నాలుగు దశాబ్దాల నాడు.. ఆ ఊరు పాడిపంటలతో గొప్పగా బతికింది. సుమారు 200 జనాభా ఉన్న ఆ గ్రామంలోని అందరికీ చేతినిండా పని ఉండేది. అయితే, తర్వాతి రోజుల్లో కరువు కాటేయటంతో గ్రామంలో పంటలు లేకుండా పోయాయి. పశు పోషణ మీద కొంత కాలం ఆధారపడినా.. క్రమంగా అదీ తగ్గిపోయింది. దీంతో, గ్రామంలోని ప్రతి కుటుంబం అప్పుల్లో కూరుకుపోయింది. ఊళ్లోని యువతీయువకులకు పెళ్లిళ్లు కావటమూ అసాధ్యమైపోయింది. దీంతో, పని కోసం వారంతా తలోదిక్కూ పట్టిపోయారు. ఊళ్లో ఉన్న ముసలివారంతా ఒక్కొక్కరుగా కన్నుమూశారు. ప్రస్తుతం ఒకే ఒక వృద్ధుడు..తంగరాజన్ మాత్రం.. పుట్టి పెరిగిన ఊరిని వదిలిపెట్టలేక.. కష్టమైనా అక్కడే ఉంటున్నాడు. తమ ఊరిలో ఏదో పని దొరకుకుతుందనే ఆశతో.. శివగంగై, తిరుచ్చి, చెన్నై వలస పోయారని, గ్రామంలో గత నవంబరులో కుటుంబ కలహాలతో ఓ హత్య జరగడంతో.. మిగిలిన వారూ ఊరొదిలి పోయారని ఆ వృద్ధుడు తెలిపాడు. తనకు కుటుంబ సభ్యులెవరూ లేరని, దీంతో తాను ఇక్కడే ఉంటున్నానని తెలిపాడు. అయితే, మీడియా ద్వారా గ్రామ పరిస్థితిని తెలుసుకున్న అధికారులు.. ఎందుకిలా జరిగిందని ఆరాతీసే పనిలో పడ్డారు.
మరిన్ని వీడియోల కోసం :