Honeymoon Tragedy: రక్తపు మడుగులో భార్య | ముస్సోరీలో ఆ రాత్రి..ఏం జరిగింది?

Updated on: Jun 20, 2026 | 1:05 PM

ముస్సోరీలో విహారయాత్రకు వెళ్లిన తెలుగు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపుతోంది. హోమ్‌స్టే గదిలో రక్తపు మరకల మధ్య ఆమె మృతదేహం లభించగా, భర్త శ్రీచరణ్‌ను పోలీసులు విచారిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్న అధికారులు అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. గాయత్రి తల్లిదండ్రులు కూడా మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు.

వైజాగ్‌కు చెందిన ఓ జంట.. వృత్తి రీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఢిల్లీలో ఉంటున్నారు. ఫ్యామిలీ వెకేషన్ కు డెహ్రాడూన్ వెళ్లారు. మంచుకొండల్లో.. రోప్ డైవింగ్ చేస్తూ.. ప్రకృతి అందాలను చూస్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అంటే జూన్ 15,సోమవారం భార్య లాడ్జిలో నగ్నంగా రక్తపు మరకలతో పడుంది. జీతానికి జీతం.. అందమైన జీవితం.. ఇంతలోనే ఇలాంటి షాకింగ్ ఇన్సిడెంట్ సంచలనం రేపుతోంది. అసలు ముస్సోరీలో ఏం జరిగింది..? మృతురాలి తల్లిదండ్రులు ఏమంటున్నారు? ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక హిల్ స్టేషన్ ముస్సోరీ లో దారుణ ఉదంతం వెలుగుచూసింది. భర్తతో కలిసి సరదాగా గడిపేందుకు హనీమూన్ కు వెళ్లిన 27 ఏళ్ల తెలుగు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని హోమ్‌స్టే గదిలోనే అనుమానాస్పద స్థితిలో శవమై తేలింది. పోలీసులు చెబుతున్న దాని ప్రకారం ఏపీలోని విశాఖపట్నంకు చెందిన రాధా గాయత్రి, శ్రీచరణ్‌లకు గత ఏడాది నవంబర్‌ 8న వివాహం జరిగింది. గాయత్రి గురుగ్రామ్‌లో ఒక ఐటీ సంస్థలో పనిచేస్తూ ఢిల్లీలో ఉంటోంది. ఆమె భర్త శ్రీచరణ్‌ పుణెలో ఒక ఐటీ సంస్థలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ హనీమూన్‌లో భాగంగా జూన్ 13న ఢిల్లీ నుంచి బయలుదేరి రిషికేశ్‌కు వెళ్లారు. తర్వాత ముస్సోరిలోని టిప్రీధర్‌ హోం స్టేలో 14వ తేదీ రాత్రి 11.30 గంటలకు దిగారు. తర్వాత ఇద్దరూ మద్యం సేవించి 3.30 గంటలకు పడుకున్నారు. అయితే ఉదయం 7:30 గంటల ప్రాంతంలో రూమ్ సర్వీస్ కు వెళ్లిన సిబ్బంది.. రూమ్ ఓపెన్ చేసి చూడగా అక్కడున్న దృశ్యం చూసి షాక్‌కు గురయ్యారు. గదిలో ఒక మహిళా ముక్కు నుంచి రక్తం కారుతూ, బట్టలు లేకుండా రక్తపు, మూత్రం మడుగులో బెడ్‌పై అచేతనంగా పడుందని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వైద్య సిబ్బందితో హోటల్ కు వచ్చిన పోలీసులు.. గాయత్రి చనిపోయినట్లు నిర్ధారించారు. రూమ్‌లో రెండు మద్యం సీసాలతో పాటు రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. వెంటనే భర్తను అదుపులోకి తీసుకొని విచారించారు. తాను నిద్ర లేచేసరికి భార్య రక్తపు మడుగులో ఉందని తనకు ఏమీ తెలియదన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, భర్త పొంతనలేని సమాధానాలు చెప్పడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ముస్సోరీ స్టేషన్ ఆఫీసర్ (SO) దేవేంద్ర చౌహాన్ చెప్పారు. విచారణలో ఆ రాత్రి కాస్త మందు తీసుకుని.. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో నిద్రపోయినట్లు మృతురాలి భర్త శ్రీచరణ్ పోలీసులకు చెప్పాడు. నిద్రలేచి చూసేసరికి తన భార్య అపస్మారక స్థితిలో ఉందని, ఆమె ముక్కు నుంచి రక్తం కారుతోందని తెలిపాడు. దీంతో ఫోరెన్సిక్ టీమ్ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించింది. భర్త చెప్పిన వివరాలకు కన్వీన్స్ కాని పోలీసులు.. శ్రీచరణ్‌ను రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు. కేసును అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని డెహ్రాడూన్‌లోని కరోనేషన్ ఆసుపత్రికి పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపారు. ఈ జంటకు వివాహమై కేవలం ఏడు నెలలు మాత్రమే కావడం, మరణం సంభవించిన తీరు అత్యంత భీతిగొలిపేలా ఉండటంతో ఈ కేసుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అతిగా మద్యం సేవించడం వల్ల జరిగిన ప్రమాదమా? లేక దీని వెనుక ఏదైనా పథకం ప్రకారం జరిగిన హత్య లేదా కుట్ర ఉందా? అనే కోణంలో ఉత్తరాఖండ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసు తీవ్రత, అనుమానాలను దృష్టిలో ఉంచుకుని, పోస్టుమార్టాన్ని నిపుణులైన వైద్యుల ప్రత్యేక ప్యానెల్‌చే నిర్వహించాలని, ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తిగా వీడియో రికార్డింగ్ (Video Recording) చేయాలని పోలీసులు ఆసుపత్రి వర్గాలను అభ్యర్థించారు. విహార యాత్రకు వెళ్లిన తమ కూతురు ఇలా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం విశాఖపట్నంలోని వారి కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. రాధా గాయత్రి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె తల్లిదండ్రులు గురువారం విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీసీపీ మణికంఠను కలిసిన తల్లిదండ్రులు సత్యవతి, సుధాకర్‌లు తమకు న్యాయం చేయాలని కోరారు. తర్వాత వారు మాట్లాడుతూ.. మా అమ్మాయిలా ఎవరికీ జరగకూడదు.. అందుకే పోలీసులను ఆశ్రయించామని చెప్పారు. గాయత్రి మొదటి నుంచి విశాఖలో చదువుకుందని, ఎంబీఏలో విజయనగరం మహారాజా కాలేజీ టాపర్‌గా నిలిచిందని తెలిపారు. గతేడాది నవంబరు 8న శ్రీచరణ్‌తో అంగరంగ వైభవంగా పెళ్లి చేశామన్నారు. ముస్సోరీలో ఈనెల 15న మంచంపై గాయత్రి స్పృహ లేకుండా పడిపోయిందని, హార్ట్‌ బీట్‌ ఉంది అంటూ అల్లుడు శ్రీచరణ్‌ ఫోన్‌ చేశారని చెప్పారు. వెంటనే ముస్సోరీకి వచ్చేయాలంటూ ఫ్లైట్‌ టికెట్స్‌ బుక్‌ చేశాడని తెలిపారు. మేం చేరుకునే సరికి ఘటనా స్థలం అంతా ఖాళీ చేసి డెహ్రాదూన్‌లో పోస్టు మార్టం కూడా పూర్తి చేశారని బోరున విలపించారు. పెళ్లై ఏడు నెలలే అవుతుందని.. శ్రీచరణ్‌ చిన్న చిన్న విషయాలను కూడా సీరియస్‌గా తీసుకునేవాడని మీడియాకు చెప్పారు. మా అమ్మాయి బ్యాగ్‌లో తనకు తెలియకుండా మా అల్లుడు ట్రాకర్‌ పెట్టాడని ఫోన్‌ చేసి చెప్పిందని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేసే సమయంలో ఓ గది అద్దెకు తీసుకుని ఉంచారని, ఎవరు ఆ ఇంటికి వెళ్లినా సీసీ ఫుటేజీలు పరిశీలించేవాడని చెప్పుకొచ్చారు. ర్యాపిడోలో వచ్చినా.. ఎవరు బైక్‌పై డ్రాప్‌ చేశారనేది వాచ్‌మెన్‌తో ఆరా తీసేవాడని అన్నారు. అంత అనుమానం ఉన్నప్పుడు అసలు పెళ్లెందుకు చేసుకోవాలని గాయత్రి తల్లిదండ్రులు ప్రశ్నించారు. జూన్‌ 17న గాయత్రి విశాఖ రావాల్సి ఉందని, 20వ తేదీ ఇంట్లో ఓ వేడుక ఉందన్నారు. ఆ ఏర్పాట్లన్నీ కూడా మా అమ్మాయే ప్లాన్‌ చేసింది’ అని తండ్రి సుధాకర్‌ తెలిపారు. అదేవిధంగా ‘గాయత్రి ఫోన్‌ కాల్‌ కంటే ఎక్కువగా వీడియో కాల్‌ చేసి మాట్లాడేదని, నన్ను చూడకుండా ఒక్క క్షణం ఉండదని తల్లి చెప్పింది. 13వ తేదీ తెల్లవారుజామున వీడియో కాల్‌ చేసి మాట్లాడిందని తెలిపింది. అత్త, మామ అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం కానీ, కుదరక తను, భర్త ఇద్దరే వెళుతున్నారని చెప్పిందన్నారు.. హరిద్వార్, రిషికేశ్‌కు కూడా వెళుతున్నట్లు తెలిపిందన్నారు. భర్తతో వెళ్లిందని ధైర్యంగా ఉన్నాం కానీ ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 14వ తేదీ ధరించిన డ్రెస్‌ చూపించడానికి వీడియోకాల్‌ చేసిందని.. ఆ రాత్రి ఏం జరిగిందో తెలియదన్నారు. పెళ్లైన రెండు నెలలకే జనవరి 7వ తేదీ ఆఫీసు బ్యాగ్‌ లో అల్లుడు ట్రాకర్‌ పెట్టాడని చెప్పి గాయత్రి తీవ్రండా బాధపడిందని తల్లి సత్యవతి కన్నీరుమున్నీరయ్యారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాన్నా ఒక్క అడుగు ముందుకు వెయ్యి.. దువ్వూరు కుటుంబ విషాదం వెనుక సీసీటీవీ బయటపెట్టిన నిజాలు

నిన్న కటిక నేలపై.. నేడు హాయిగా కుర్చీలో.. సిద్ధిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పరిస్థితి ఇదీ

ప్రెగ్నెన్సీ నుంచి బిడ్డకు 6 నెలలు వచ్చే వరకు.. రూ.4 లక్షలు ఖర్చు.. మరి చదువుల సంగతి?

మధుమేహం, గుండె జబ్బులు లేని “డిజైనర్‌ బేబీస్‌”

బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో షాకింగ్ దృశ్యాలు.. ఇది ఎయిర్‌పోర్టా.. రైల్వేస్టేషనా!

Published on: Jun 20, 2026 12:50 PM
Follow Us