Monsoon Update: పసిఫిక్‌లో ఎల్‌నినో సెగ.. భారత్‌లో నిలకడగా రుతుపవనాలు.. కరువు భయం లేనట్లే!
భారత వ్యవసాయానికి కీలకమైన నైరుతి రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు జలాశయాలకు వరద ప్రవాహాలు కొనసాగుతుండగా, ఇండోనేషియాలో భారీ భూకంపం కలకలం రేపింది.
భారత వ్యవసాయానికి రుతుపవనాలు ఎంతో కీలకం. దేశంలోని కోట్లాది మంది రైతులు వర్షాధార పంటలపై ఆధారపడుతుంటారు. జూన్, జూలైలో వర్షాల తీరును బట్టి పంటల సాగు ప్రభావితమవుతుంది. ముఖ్యంగా ఆగస్టు నెలలో వచ్చే వర్షాలు పంటల ఎదుగుదలకు చాలా అవసరం. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షపాతం లోటు కనిపించగా.. మరికొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు నమోదవుతున్నాయి. ఈ అసమాన పరిస్థితులను సమతుల్యం చేయడంలో బంగాళాఖాతం నుంచి వచ్చే అల్పపీడనాలు కీలకంగా మారుతున్నాయి. మరోవైపు.. పసిఫిక్ మహాసముద్రంలో తీవ్రమైన ‘ఎల్ నినో’ వేగంగా బలపడుతోంది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఈ ఎల్ నినో తీవ్రత 69 శాతం మేర పెరిగే ప్రమాదముందని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. 1950 నుంచి ఇంతటి స్థాయిలో ఈ ప్రభావం నమోదు కావడం ఇదే తొలిసారని కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కూడా పార్లమెంట్‌లో ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అయితే.. ఎల్ నినో ఏర్పడినంత మాత్రాన ఖచ్చితంగా కరవు వస్తుందని కూడా చెప్పలేమని పరిశోధకులు చెబుతున్నారు. ఎల్ నినో ప్రభావం, భారత రుతుపవనాల వర్షపాతాల మధ్య గల సంబంధాన్ని వర్షరుతువు మొత్తంలో కురిసిన వర్షం ఆధారంగానే తప్ప.. ఒకటి, రెండు వారాల వర్షపాతం ఆధారంగా నిర్ధారించలేమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆగస్టు మొదటి వారంలో భారీ వర్షాలు కురవకపోయినా.. నైరుతీ రుతుపవనాలు ముగిసే సెప్టెంబర్ 30 నాటికి మంచి వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ భావిస్తోంది. ముఖ్యంగా దక్షిణాదిలో ఈశాన్య రుతుపవనాల వలన అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య వర్షపాతం పెరిగే అవకాశముందని, దీనివలన ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు కరువు భయం ఉండే అవకాశం తక్కువని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతాన్ని ఈ సీజన్‌కి.. రెయిన్ ఫ్యాక్టరీ అంటారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాతావరణం వర్షాలకు అనుకూలంగా ఉందని యురోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌క్యాస్ట్స్ సంస్థ ప్రకటించింది. ఈ సంస్థ అంచనా ప్రకారం వచ్చే 15 రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో తగినంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా సెంట్రల్ ఇండియాతోపాటు దేశంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో బలపడుతున్న’పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్’ ఎల్ నినో వల్ల కలిగే పొడి వాతావరణ ప్రభావాన్ని సమర్థవంతంగా అడ్డుకుని భారత్‌లో అనుకూల వర్షపాతానికి తోడ్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక..తెలుగు రాష్ట్రాల్లో రాబోయే వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయవ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావం వల్ల శనివారం నుంచి రాబోయే ఆరు నుంచి ఏడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే వాతావరణం నెలకొంది. గాలులు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొడి వాతావరణంతో పాటు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో ఆగస్టు 18 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని ఐఎండీ హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వేగవంతమైన గాలులు వీచే వీలున్నందున తీరప్రాంత ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం పూర్తిస్థాయిలో నిలిచిపోయింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో సున్నా (నిల్) కాగా, దిగువకు 58,865 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 877.60 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. అలాగే ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 176.33 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. నీటి విడుదల కొనసాగుతుండటంతో కుడిగట్టు, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా జరుగుతోంది. తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 25,263 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, దిగువకు 5,768 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,633 అడుగులు కాగా, ప్రస్తుతం 1,629.20 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. అలాగే ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 105.78 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 91.08 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో శనివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాజధాని హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశముంది. ఎగువ ప్రాంతాల నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి వరద నీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 66,272 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, 14,050 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 524.60 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. అలాగే పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 157.79 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం తీరప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్‌లోని ఎండే పట్టణానికి ఉత్తర-వాయవ్యంగా 68 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం నమోదైంది. దీని ప్రభావంతో 5.9, 5.6, 6.1 తీవ్రతలతో వరుస భూకంపనలు వచ్చాయి. భూ ప్రకంపనల తీవ్రతకు ఆసుపత్రుల గోడలకు బీటలు వారడంతో రోగులు బయటకు పరుగులు తీశారు. మౌమెరే ప్రాంతంలో సముద్రం వెనక్కి పోవడంతో.. సునామీ వస్తుందని భయపడ్డారు. అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టి పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nani: ఆసక్తికరంగా నాని హీరోయిన్స్ సెలక్షన్
Shraddha Srinath: మూడు భాషల్లో హిట్లు.. అయినా అవకాశాలు కరువు! శ్రద్ధా శ్రీనాథ్ కెరీర్‌కు ఏమైంది?
Ritika Nayak: వరుస హిట్లతో టాలీవుడ్‌లో గోల్డెన్ హ్యాండ్‌గా మారిన యంగ్ బ్యూటీ.. ఎవరో తెలుసా?
Dhurandhar: థియేటర్లలో వేల కోట్లు.. ఇప్పుడు ఓటీటీలోనూ వరల్డ్ రికార్డ్! ‘ధురంధర్’ దుమ్మురేపుతోంది
పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ!
