మనుషుల మానసిక ఒత్తిడికి కారణం.. వారి పొట్టలోని పేగులా ??

Updated on: Oct 21, 2025 | 2:33 PM

ఇటీవల కాలంలో మానసిక ఒత్తిడికి గురవుతున్నవారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. ఈ డిప్రెషన్‌, ఒత్తిడికి చిన్న పిల్లలనుంచి వృద్ధులవరకూ బాధితులు ఉన్నారు. అయితే ఈ ఒత్తిడికి సంబంధించి తాజా అధ్యయనంలో ఓ షాకింగ్‌ నిజం తెలిసింది. అదేంటంటే.. మన మానసిక ఆరోగ్యానికి, పొట్టలోని పేగులకు సంబంధం ఉందంట. నమ్మశక్యంగా లేకపోయినా ఇదే నిజమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని వేధిస్తున్న డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి తీవ్రమైన మానసిక సమస్యలకు పరిష్కారం మన పేగుల్లోనే దాగి ఉందని తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేస్తోంది. ఈ ఆవిష్కరణ మానసిక ఆరోగ్య చికిత్సా విధానంలో ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని నిపుణులు భావిస్తున్నారు. పేగులు, మెదడు మధ్య ఉన్న సంబంధంపై యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా పరిశోధకులు లోతైన అధ్యయనం చేశారు. పేగుల్లో నివసించే కోట్ల సంఖ్యలోని సూక్ష్మజీవులు మెదడు పనితీరును, రసాయన సమతుల్యతను నేరుగా ప్రభావితం చేయగలవని తమ పరిశోధనలో బలమైన ఆధారాలు కనుగొన్నారు. ఈ అధ్యయనం వివరాలు నేచర్ మెంటల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శ్రీనివాస్ కామత్ మాట్లాడుతూ…మానసిక ఆరోగ్య పరిశోధనలలో పేగు-మెదడు సంబంధం అనేది అత్యంత ఆసక్తికరమైన అంశం. మన జీర్ణవ్యవస్థలోని సూక్ష్మజీవులు రసాయన, నరాల మార్గాల ద్వారా మెదడుతో మాట్లాడతాయని, మన మానసిక స్థితిని, ఒత్తిడి స్థాయిని, ఆలోచనా శక్తిని కూడా ప్రభావితం చేస్తాయని వారికి ఇప్పటికే తెలుసు అని వివరించారు. పేగుల్లోని మార్పులు మానసిక వ్యాధులకు కారణమవుతాయా? లేక కేవలం వాటి లక్షణమా? అనే ప్రశ్నకు ఈ అధ్యయనం సమాధానం ఇస్తోందని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 97 కోట్ల మంది మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో మూడింట ఒక వంతు మందికి ప్రస్తుత మందులు లేదా చికిత్సలు సరిగా పనిచేయడం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ కొత్త పరిశోధన ఆశాకిరణంగా మారింది. పరిశోధనలో పాలుపంచుకున్న డాక్టర్ పాల్ జాయిస్ మాట్లాడుతూ… మానసిక వ్యాధులలో పేగు బ్యాక్టీరియా ప్రత్యక్ష పాత్ర పోషిస్తోందని రుజువైతే, వ్యాధి నిర్ధారణ, చికిత్స, నివారణ పద్ధతులు పూర్తిగా మారిపోతాయి. ప్రోబయోటిక్స్, సరైన ఆహారం వంటి మైక్రోబయోమ్ ఆధారిత చికిత్సలు తక్కువ ఖర్చుతో, సురక్షితంగా, అందరికీ అందుబాటులోకి వస్తాయి అని తెలిపారు. జంతువులపై చేసిన ప్రయోగాలలో పేగుల్లోని సూక్ష్మజీవులను మార్చడం ద్వారా వాటి ప్రవర్తన, ఒత్తిడి స్థాయులలో మార్పులు రావడం జ‌రిగింది. అలాగే డిప్రెషన్, స్కిజోఫ్రెనియా వంటి సమస్యలున్న వారిలో పేగుల పనితీరు అస్తవ్యస్తంగా ఉండటం వంటివి గమనించారు. ఆహారం, పర్యావరణం, జీవనశైలి వంటి అంశాలు పేగు-మెదడు సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునేందుకు భవిష్యత్తులో మరింత విస్తృతమైన పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహిళల్లోనే ఎక్కువ డిప్రెషన్‌ ఎందుకు? పరిశోధనల్లో బయటపడ్డ కీలక విషయాలు!

యువతకు హెచ్చరిక! మలంలో రక్తమా? క్యాన్సర్‌కు సంకేతం!