ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. ఇంకా మిస్టరీగానే మిస్సింగ్‌ కేసు..

Updated on: Jun 10, 2026 | 11:17 AM

ఉత్తరాఖండ్‌లోని దయారా బుగ్యాల్ ట్రెక్కింగ్ సందర్భంగా అదృశ్యమైన ఎంబీయే విద్యార్థిని బబితా పాండే కోసం పదిరోజులుగా భారీ గాలింపు కొనసాగుతోంది. SDRF, NDRF, పోలీసులు, డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్ సహాయంతో అన్వేషణ చేపట్టినా ఆమె ఆచూకీ లభించలేదు. ఈ కేసు దర్యాప్తులో నకిలీ ట్రెక్కింగ్ పర్మిట్ల వ్యవహారం కూడా వెలుగులోకి రావడంతో అధికారులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు.

ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వత పరిసరాల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఎంబీయే విద్యార్థిని బబితా పాండే గత పది రోజులుగా కనిపించకుండా పోయింది. దయారా బుగ్యాల్ ట్రెక్కింగ్ మార్గంలోని గోయ్ బేస్ క్యాంప్ నుంచి మే 29 అర్ధరాత్రి ఆమె అదృశ్యమైంది. నైనిటాల్ జిల్లా రామ్‌నగర్‌కు చెందిన బబితా పాండే.. తన స్నేహితులైన హర్మాన్‌పాల్ సింగ్, హర్మాన్‌ప్రీత్ సింగ్‌తో కలిసి మే 29న ఉత్తరకాశీ చేరుకుంది. రైతల్ గ్రామం నుంచి వీరు ట్రెక్కింగ్ ప్రారంభించి, రాత్రికి గోయ్ బేస్ క్యాంప్‌లో టెంట్లు వేసుకుని బస చేశారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత బబితా అక్కడ నుంచి మాయమైంది. బబిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమె ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి మధ్య ఏవైనా వ్యక్తిగత గొడవలు జరిగాయా? లేక మరేదైనా కోణం ఉందా? అనే దిశగా దర్యాప్తు సాగుతోంది. మే 30 నుంచి దాదాపు 150 మంది SDRF, NDRF, పోలీస్, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది 5 కిలోమీటర్ల పరిధిలో విస్తృతంగా గాలిస్తున్నారు. ఎత్తైన పర్వత ప్రాంతాలు కావడంతో ఆదివారం నుంచి హెలికాప్టర్ల ద్వారా ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. అలాగే అడవుల్లో స్నిఫర్ డాగ్స్, డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. బేస్ క్యాంప్ సమీపంలోని ఒక సరస్సులో గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు జరుపుతున్నారు. అయినప్పటికీ బబితా జాడ దొరకకపోవడంతో ఆమె తల్లి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ కేసు దర్యాప్తులో పర్యాటక శాఖకు సంబంధించిన నకిలీ పర్మిట్ల వ్యవహారం గుట్టు రట్టయింది. ఆ ముగ్గురు యువతీ యువకులు అధికారిక పోర్టల్ ద్వారా ఎలాంటి డిజిటల్ పర్మిట్లు తీసుకోలేదని అధికారులు గుర్తించారు. గడువు ముగిసిపోయిన పాత ఫిజికల్ పర్మిట్‌పై పేర్లు మార్చి, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ వీరు ట్రెక్కింగ్‌కు వెళ్లినట్లు తేలింది. దీనికి సహకరించిన రైతల్ బేస్డ్ ట్రావెల్ ఏజెన్సీ రిజిస్ట్రేషన్‌ను మోసం కేసు కింద అధికారులు సస్పెండ్ చేశారు. రోజురోజుకూ సమయం గడిచిపోతుండటం, హిమాలయాల్లో వాతావరణం క్లిష్టంగా మారుతుండటంతో బబితా క్షేమంగా తిరిగిరావాలని స్థానికులు ప్రార్థిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Katrina Kaif: కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.

జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో

సంపదలో అంబానీనే దాటేసిన టిక్‌టాక్‌ ఫౌండర్‌

మొక్కలు సహాయం కోసం అరుస్తాయా? ప్రకృతి రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు!

అమెరికాలో రూ.1 కోటి జీతం వచ్చినా.. చివరకు మిగిలేదెంత..?

Follow Us