Hyderabad: రూ.26 వేలకే కారు అంటూ ప్రచారం.. పోటెత్తిన జనం.. ఆ తర్వాత..
26 వేలకే కారు.. రిపబ్లిక్ డే స్పెషల్ ఆఫర్.. అంతే… నమ్మిన జనం పెద్ద సంఖ్యలో హైదరాబాద్ మల్లాపూర్‌లోని ట్రస్ట్ కార్స్ షోరూం వద్దకు చేరుకున్నారు. తెల్లవారుజామునే షాపు ముందు జనసంద్రం ఏర్పడింది. కానీ అక్కడ ఉన్నవి కేవలం 10 కార్లు మాత్రమే. 50 కార్లు అమ్ముతానని ప్రచారం చేసిన వ్యాపారి రోషన్, పరిస్థితి అదుపు తప్పడంతో చేతులెత్తేశాడు.
రిపబ్లిక్ డే సందర్భంగా 26 వేలకే కారు అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఓ అడ్వర్టైజ్‌మెంట్ హైదరాబాద్ మల్లాపూర్‌లో కలకలం సృష్టించింది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్‌కు చెందిన రోషన్ తన ట్రస్ట్ కార్స్ షోరూంలో 50 కార్లు ఆ ధరకు విక్రయిస్తానంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. ఈ ప్రచారాన్ని నమ్మిన స్థానికులు సోమవారం తెల్లవారుజామునే భారీ సంఖ్యలో షోరూం వద్దకు చేరుకున్నారు. అయితే అక్కడ కేవలం 10 కార్లు మాత్రమే ఉండటంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.మోసం జరిగిందని భావించిన జనం ఆగ్రహంతో షోరూంలో ఉన్న కార్లపై రాళ్లతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. మోసపూరిత ప్రకటన చేసి ప్రజలను తప్పుదోవ పట్టించాడని వ్యాపారి రోషన్‌పై నాచారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సోషల్ మీడియాలో కనిపించే ఆఫర్లను పూర్తిగా నమ్మే ముందు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.