మారుతున్న వాతావరణం..ఎండ లేకపోతే వర్షమే వర్షం, ఎందుకంటే?వీడియో

Updated on: Sep 11, 2025 | 1:23 PM

దేశంలోకి ఈ ఏడాది రుతుపవనాలు కాస్త ముందుగానే వచ్చాయి. కానీ వాటి ప్రభావం మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. ఓ రకంగా చెప్పాలంటే రుతుపవనాలు ఆటాడుకుంటున్నాయా అనిపిస్తోంది. అయితే కుండపోత వర్షాలు..లేదంటే దారుణమైన కరువు కాటకాలు. ఈ పరిస్థితులకు కారణం మానవులు చేసే తప్పిదాలేనా అంటే అవుననే అనిపిస్తుంది. ఈ ఏడాది దేశంలో రుతుపవనాల గమనం వింతగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో భారీవర్షాలు వరదలతో బీభత్సం సృష్టిస్తే.. మరికొన్ని ప్రాంతాల్లో వానచినుకు కోసం రైతులు, ప్రజలు పడిగాపులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విపత్కర పరిస్థితులకు వాతావరణ మార్పులు మాత్రమే కారణం కాదని, మన పట్టణ ప్రణాళికల్లోని లోపాలే కీలక పాత్ర పోషిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఐఐటీ భువనేశ్వర్‌కు చెందిన స్కూల్ ఆఫ్ ఎర్త్, ఓషన్-క్లైమేట్ సైన్సెస్ అసోసియేట్ ప్రొఫెసర్ సందీప్ పట్నాయక్ ఈ అంశంపై కీలక విషయాలు వెల్లడించారు. దేశంలో సంభవిస్తున్న విపత్తులకు వాతావరణ మార్పు.. ఒక కారణం మాత్రమేనని అన్నారు. నగరాల్లో సరైన ప్రణాళిక లేకపోవడం, డ్రైనేజీ వ్యవస్థలు సక్రమంగా పనిచేయకపోవడం, మితిమీరిన కాంక్రీట్ వాడకం వంటివి తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయని వివరించారు. వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేక, నగరాలు తేలికగా ముంపునకు గురవుతున్నాయని ఆయన తెలిపారు. రుతుపవనాల కాలంలో ఈ ఏడాది దేశవ్యాప్తంగా వర్షపాతంలో నాటకీయమైన మార్పులు కనిపించాయని పట్నాయక్ పేర్కొన్నారు. పాశ్చాత్య అవాంతరాల కారణంగా జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉత్తరాఖండ్, బీహార్ రాష్ట్రాల్లో భారీ వరదలకు ఏకంగా గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయి వందల మంది గల్లంతయ్యారు. దీనికి పూర్తి విరుద్ధంగా, గంగా మైదాన ప్రాంతాలు జూన్‌లో ఒక్క వానచినుకు పడక ఎండిపోయాయి. మధ్య భారతదేశం మాత్రం భారీ వర్షాలతో తడిసిముద్దయింది. హిమాలయ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా నీరు ఎక్కువగా ఆవిరై, వాతావరణంలో తేమ పెరుగుతోందని పట్నాయక్ వివరించారు. దీనివల్ల మేఘాలు దట్టంగా మారి, బరువెక్కి కుండపోత వర్షాలుగా కురుస్తున్నాయని, ఇవే కొండచరియలు విరిగిపడటానికి కారణమవుతున్నాయని తెలిపారు. అంతేకాదు, బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన వ్యవస్థ, రుతుపవనాలు కలిసి పర్వత ప్రాంతాల్లో గాలుల దిశను మార్చివేస్తున్నాయని, ఈ కారణంగానే కేరళలో కొండచరియలు విరిగిపడి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆయన విశ్లేషించారు.

మరిన్ని వీడియోల కోసం :

లగ్జరీ బంగ్లాను ఖాళీ చేసిన స్టార్‌ కపుల్‌.. కారణం తెలిస్తే షాకవుతారు వీడియో

ఏపీ, తెలంగాణలో దసరా సెలవులు ఎప్పటినుంచంటే? వీడియో

‘స్పిరిట్’ పై సందీప్ రెడ్డి అప్ డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు వీడియో

ఎంతైనా తల్లితల్లే..పిల్లల కోసం చిరుత ఏం చేసిందంటే? వీడియో